
యల్లమిల్లి కుటుంబం అభ్యున్నతికి సత్యవతి కృషి ఎనలేనిది
తాను చదువుకోకపోయినా విద్యపై ఎంతో మక్కువ
నరసింహమూర్తి బాటలోనే సతీమణి
ప్రజాశక్తి - పాలకోడేరు
ఆమె నిరక్ష్యరాసురాలు.. ఏమి చదువుకోలేదు.. కనీసం ఆమెకు సంతకం కూడా చేయడం రాదు. అయినా విద్యపై ఎంతో మక్కువతో కుటుంబాన్ని విద్యలో అభివృద్ధి చేసి కుటుంబ సభ్యులను వివిధ ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగాల్లో నిలిపేందుకు అన్ని తానై ఆడది అబల కాదు సబల అని మరోసారి నిరూపించారు. ఆమె మరెవరో కాదు రిటైర్డ్ ఉపాధ్యాయులు, నటుడు, అభ్యుదయవాది వేండ్ర గ్రామానికి చెందిన యల్లమిల్లి నరసింహమూర్తి సతీమణి యల్లమిల్లి సత్యవతి. ఇటీవల సత్యవతి (77) అనారోగ్యంతో మృతి చెందారు. ఐదు నెలల క్రితం నరసింహమూర్తి మృతి చెందారు. అప్పటినుంచి భార్య సత్యవతి మనస్తాపానికి లోనై అనారోగ్యానికి గురై ఇటీవల మృతి చెందారు. గణపవరం మండలంలోని దేవర గోపవరం గ్రామానికి చెందిన కొప్పిశెట్టి వెంకన్న, సుబ్బమ్మ దంపతుల కుమార్తె సత్యవతిని నరసింహమూర్తి వివాహం చేసుకున్నారు. నరసింహమూర్తి ఉపాధ్యాయునిగా, యుటిఎఫ్ నేతగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ముందుండి, సిపిఎం నాయకునిగా కార్మికులకు అండగా ఉండి, గ్రామంలో ఏ సమస్య వచ్చినా పరిష్కార మార్గం చూపుతూ కళాకారుడిగా సమాజానికి అనేక సేవలందించారు. సత్యవతి కూడా భర్త నరసింహమూర్తి బాటలోనే నడిచారు. ఉపాధ్యాయుని గా విద్యార్థులకు విద్యాబుద్ధులు, సమాజ రుగ్మతలకు వ్యతిరేకంగా సమాజానికి నరసింహమూర్తి సేవలందిస్తే సత్యవతి కుటుంబాన్ని చక్కబెట్టి, అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించేవారు.
నరసింహమూర్తి దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. అచ్యుత సూర్య సుబ్రహ్మణ్యం, సూర్యనారాయణమూర్తి (వైఎస్‌ఎన్.మూర్తి), సత్యనారాయణ, శ్రీనివాసరావు, వెంకటలక్ష్మి ఉన్నారు. అయితే సత్యవతి నిరక్ష్యరాసులు అయినప్పటికీ ఒకపక్క విద్యపై మక్కువ మరోపక్క కుటుంబాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగేవారు. వీరిని ఉన్నత చదువులు చదివించి. భవిష్యత్తుకు బంగారు బాట వేయడంలో నరసింహమూర్తిలో సగ భాగమై సత్యవతి కుటుంబానికి అన్ని తానే కుటుంబాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది. ఈ ఐదుగురు సంతానం, వీరి కుమారులు, కుమార్తెలు కూడా విద్యలో అన్ని విధాలుగా అభివృద్ధి చెంది వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల్లో ఉన్నారంటే వారు చేసిన కృషి ఫలితమే. అన్ని విషయాల్లో నరసింహమూర్తి బాటలోనే సత్యవతి నడుస్తూ ఉండేవారు. గ్రామంలో మహిళలకు చేదోడు వాదోడుగా ఉంటూ అనేక సూచనలు, సలహాలు అందించేవారు. ముఖ్యంగా శుభకార్యాలకు సత్యవతికి గ్రామస్తులు మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు. అనునిత్యం నరసింహమూర్తికి తోడుగా ఉంటూ కుటుంబాన్ని అన్నివిధాలా ఆమె ముందుకు నడిపించిన తీరు ఎంతోమందికి ఆదర్శమని చెప్పొచ్చు. అయితే ఐదు నెలల కాలంలోనే కుటుంబనికి పెద్ద దిక్కుగా ఉన్న తల్లితండ్రులు కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.