ప్రజాశక్తి - క్రోసూరు : ఆరు నెలలుగా వేతనాల్లేక అల్లాడుతున్నా పట్టించుకోవటం లేదని మండల కేంద్రమైన గ్రామపంచాయతీ కార్మికులు వాపోయారు. ఈ మేరకు సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యాక్షులు జి.రవిబాబు ఎదుట సోమవారం వారి ఆవేదనను వెళ్లబోసుకున్నారు. ఇతర గ్రామాల నుండి తాము పనులకు వస్తున్నామని, కుటుంబాలు గడవడమే కష్టమైందని, పైగా రోజుకు రూ.40 ఛార్జీలకు ఖర్చవుతున్నాయని చెప్పారు. 5వ తేదీలోపు వేతనాలు ఇస్తే డ్వాక్రా రుణాలతోపాటు ఇతర ఖర్చులకూ గడుస్తుందన్నారు. నెలల తరబడి జీతాలివ్వకపోవడంతో డ్వాక్రా రుణాల చెల్లించలేక పోతున్నామని, నలుగుర్లో అబాసుపాలవుతున్నామని వాపోయారు. రవిబాబు మాట్లాడుతూ కార్మికులకు పెండింగ్ వేతనాలను ఇవ్వకుంటే ఆందోళన చేస్తామని చెప్పారు. అనంతరం దీనిపై పంచాయతీ కార్యదర్శి నాయక్‌కు విన్నవించారు. రేపటిలోగా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన సమాధానం ఇచ్చారు. మాట నిలబెట్టుకోకుంటే మరుసటి రోజు నుండే విధులు ఆపేసి నిరసనకు దిగుతామని రవిబాబు, కార్మికులు చెప్పారు.










