ప్రజాశక్తి - మార్టూరు రూరల్ : టిడిపి అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు, రిమాండ్ విధించడంలో వైసిపి ప్రభుత్వం కుట్రపూరితంగా చేసిందని, మచ్చలేని చంద్రుడిలా చంద్రబాబు బయటకు వస్తారని టిడిపి బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రబాబుకు ఏదైన హాని జరిగితే జగన్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. చంద్రబాబు భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ కళ్ళలో ఆనందం చూసేందుకే చంద్రబాబు విషయంలో అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారని మండిపడ్డారు. సీఐడీ వ్యవస్థను జగన్ జేబు వ్యవస్థగా మార్చారని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా వేలాదిమంది యువతకు ఉద్యోగాలు కల్పించారని గుర్తు చేశారు. సంబంధం లేని విషయంలో కక్షపూరితంగా చంద్రబాబును అరెస్టు చేశారని అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రానికి భవిష్యత్తు లేదన్నారు. అక్రమ అరెస్టుకు అత్యుత్సాహం చూపిన అధికారులు, ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. బందుకు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మూడు రోజులుగా నిద్రహారాలు మాని అధినేతకు మద్దతుగా నిలిచిన టిడిపి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని అన్నారు.










