వెనిజులా మరోసారి వార్తల్లోకి వస్తోంది. దానిపై మీడియా సంస్ధలు, ప్రముఖులుగా ఉన్న కొందరు చేయని ప్రచారం లేదు. అక్కడ సమస్యల్లేవని ఎవరూ చెప్పలేదు. కాకపోతే తమ పైత్యాన్ని జోడించే వారి గురించి పట్టించుకోనవసరం లేదు. వెనిజులా సెంట్రల్ (రిజర్వు) బ్యాంకు వెల్లడించిన సమాచారం ప్రకారం 2021లో 686.4 శాతం ద్రవ్యోల్బణం ఉంది. అంతకు ముందు సంవత్సరం 2,959.8 శాతం ఉంది. గతేడాది సెప్టెంబరు నుంచి నెలవారీ ద్రవ్యోల్బణం ఒక అంకెకు పరిమితం అవుతోంది. వందలు, వేల శాతాల్లో నమోదైన ద్రవ్యోల్బణం అంటే అర్ధం ఏమిటి? ఒక వస్తువు ధర ఈ క్షణంలో ఉన్నది మరో క్షణంలో ఉంటుందన్న హామీ ఉండదు. చేతిలో ఉన్న కరెన్సీతో ఫలితం ఉండదు. రాయిటర్స్ వార్తా సంస్ధ కథనం ప్రకారం కరెన్సీ మారకపు రేటును స్ధిరంగా ఉంచేందుకు తీసుకున్న చర్యలతో ఫలితాలు కనిపించాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్ధ సరఫరాదార్లకు విదేశీ కరెన్సీ (డాలర్లలో) చెల్లింపులు చేస్తోంది. ఒక ఆశావహ పరిస్ధితి ఏర్పడింది. ప్రభుత్వ టీవీలో దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో మాట్లాడుతూ 'నాలుగు సంవత్సరాలు నడిచిన హైపర్ ద్రవోల్బణం గత చరిత్రే. ఐతే ఇప్పటికీ ఈ సమస్య తీవ్రమైనదే' అన్నారు.
లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాలకు చెందిన ఐరాస ఆర్థిక కమిషన్ వచ్చే ఏడాది ఈ ప్రాంత దేశాల జిడిపి వృద్ధిరేటు సగటున 2.1 శాతం కాగా, వెనిజులా రేటు 3 శాతంగా పేర్కొన్నది. గత ఏడు సంవత్సరాలలో ఇది తొలి సానుకూల సంవత్సరం కావటం గమనించాల్సిన అంశం. 2014 నుంచి ఇటీవలి వరకు దేశ జిడిపి 75 శాతం పతనమైంది. మరొక దేశం ఏదైనా ఈ స్థితిని తట్టుకొని నిలిచిందా? వెనిజులా వామపక్ష పార్టీల ఏలుబడిలో ఉంది తప్ప అమలు జరుపుతున్న విధానాలన్నీ సోషలిస్టు పద్ధతులు కావు. ఇటీవలి కాలంలో అక్కడి కమ్యూనిస్టు పార్టీ, పాలక సోషలిస్టు పార్టీ మధ్య విభేదాలు కూడా తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. వాటిని అంతర్గతంగా అక్కడే పరిష్కరించుకుంటారు. జనాన్ని ఆదుకొనేందుకు ఉపశమన చర్యలు వేరు, దీర్ఘకాలిక సోషలిస్టు సంస్కరణలు వేరు. సోషలిస్టు క్యూబా, దానికి మద్దతు ఇస్తున్న వెనిజులా వేరు. లాటిన్ అమెరికాలో వామపక్ష పార్టీలు, ప్రభుత్వాలను దెబ్బ తీసేందుకు అమెరికా, కెనడా, ఐరోపా ధనిక దేశాలు ఇంతకంటే ఎక్కువగా ప్రాణాలు తీసే దుర్మార్గాలకు పాల్పడుతున్నాయి. 2018లో డ్రోన్‌తో దాడి చేసి మదురోను హత్య చేయాలని చూశారు. అంతర్గత తిరుగుబాట్లను రెచ్చగొట్టి అసలు ప్రభుత్వాన్నే గుర్తించలేదు. అక్కడ ప్రజాస్వామ్యం లేదు. ఎవరూ పెట్టుబడులు పెట్టవద్దని బహిరంగంగా ఇచ్చిన పిలుపులు వెనిజులా వ్యతిరేకులకు వీనుల విందుగా ధ్వనించి ఉండాలి.
మన దేశంలో వెయ్యి మంది జనాభాకు 44 కార్లు వున్నాయి. ప్రపంచంలో కార్ల సాంద్రతలో మనం 132వ స్ధానంలో ఉండగా వెనిజులా 96వ స్థానంలో ఉంది. అక్కడ వెయ్యి మందికి 145 కార్లు వున్నాయి. ఐరాస మానవాభివృద్ధి సూచికలో 2021లో మనం 131 స్ధానంలో ఉంటే వెనిజులా 113లో ఉంది. 2021లో ప్రపంచ ఆకలి సూచికలో 116 దేశాల్లో మన దేశం 101 స్థానంలో వుండగా వెనిజులా 82లో ఉంది. ఎనిమిదేళ్ల మన ఘనమైన పాలన చేసిందేమిటి ?
2014 చమురు మార్కెట్లు పతనం కావటంతో ఎగుమతుల మీద ఆధారపడిన వెనిజులా తీవ్రంగా నష్టపోయింది. అమెరికా తదితర దేశాల ఆంక్షలతో చమురును వెలికితీసే కంపెనీలు ముఖం చాటేశాయి. గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో కార్ల ఉత్పత్తి ఆగిపోయింది. ఒక సమాచారం ప్రకారం 2021 ప్రారంభంలో దేశంలో ఉన్న 41 లక్షలకు పైగా ఉన్న కార్లలో సగానికి మాత్రమే అక్కడ ఉత్పత్తి జరిగే పెట్రోలు, డీజిలు సరిపోతున్నది. గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ డాట్ కామ్ సమాచారం ప్రకారం జనవరి 24న అక్కడ లీటరు పెట్రోలు ధర రూ.1.87. ఇటీవలి కాలంలో తిరిగి ముడి చమురు ఉత్పత్తితో పాటు ధరలు పెరగటం దానికి ఎంతగానో ఉపశమనం కలిగించింది. డిసెంబరు 2021 నాటికి రోజుకు పదిలక్షల పీపాలకు ఉత్పత్తి పెరిగింది. ఆంక్షల కారణంగా ఇప్పటికీ శుద్ధి కర్మాగారాలు మరమ్మతులకు నోచుకోలేదు.
ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా వెనిజులాకు ఉపశమనం కలిగిస్తున్నాయి. చైనా, రష్యా, ఇరాన్‌తో చమురు రంగంలో కుదుర్చుకున్న పెట్టుబడుల ఒప్పందాలు కీలకమైనవి. అమెరికా ఆంక్షల కారణంగా దాదాపు వెనిజులా చమురు ఉత్పత్తి నిలిపివేసిన తరుణంలో ఒప్పందం చేసుకున్న ఇరాన్ ఆహారం, చమురు ట్యాంక్లను పంపి ఎంతగానో ఆదుకుంది. చాలా మందికి అర్ధంగాని అంశం ఏమంటే వామపక్షాలు అధికారానికి రాకముందే అక్కడి చమురు పరిశ్రమ అమెరికా, ఐరోపా ధనికదేశాల సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమైంది. అందువలన దానికి అవసరమైన విడిభాగాలు కావాలంటే పశ్చిమ దేశాల నుంచి, వాటి అనుమతితోనే తెచ్చుకోవాలి. దీన్ని అవకాశంగా తీసుకొని వెనిజులాను అవి దెబ్బతీస్తున్నాయి. రష్యా, ఇరాన్ ఇటీవలి కాలంలో ఆ సాంకేతిక పరిజ్ఞానానికి ప్రత్యామ్నాయం కనుగొనటంతో పశ్చిమ దేశాల ఆటలు సాగటం లేదు. భారీ సాంద్రత కలిగిన వెనిజులా ముడి చమురును శుద్ధి సమయంలో పలుచనగావించేందుకు అవసరమైన డైల్యూటెంట్‌ను ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటోంది.వీటికి తోడు చమురు తవ్వక రంగంలో పోటీ కూడా వెనిజులాకు కలసివచ్చింది. చిన్న డ్రిల్లింగ్ సంస్ధలు ముందుకు వచ్చాయి. అనేక ఆంక్షలను పక్కన పెట్టి తనకు అవసరమైన చమురు కొనుగోలు ద్వారా మరో రూపంలో చైనా పెద్ద ఎత్తున తోడ్పడింది. అమెరికా చంకలో దూరిన మనవంటి దేశాలపై అమెరికా వత్తిడి తెచ్చి వెనిజులా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయించాయి. లాయడ్ లిస్ట్ ఇంటర్నేషనల్ ప్రకారం 2020లో 150 ఓడలు మలేసియా మీదుగా చైనా, ఇండోనేషియాలకు వెనిజులా చమురును సరఫరా చేశాయి. అమెరికా ఆంక్షలు విధిస్తున్నకొద్దీ ఇతర మార్గాలు అనేకం వచ్చాయి. ఈ ఏడాది 17 లక్షల పీపాలు అదనంగా ఉత్పత్తి జరగవచ్చని భావిస్తున్నారు. ఇరాన్, వెనిజులా నుంచి చమురు చౌకగా లభించనుండటంతో పాటు సరఫరా హామీ ఉంటుంది. 1990లో రోజుకు 32 లక్షల పీపాల చమురు వెలికి తీసిన వెనిజులా రిగ్గులు అమెరికన్ల దుర్మార్గం కారణంగా దాదాపు నిలిపివేసిన స్ధితికి చేరుకున్నాయి. ఇరాన్ తోడ్పడుతూ రోజుకు నాలుగున్నర నుంచి ఐదు లక్షల పీపాల చమురు ఉత్పత్తికి పథకాలు వేశారు.
వెనిజులా ఇబ్బందుల గురించి ఎకసెక్కాలాడటం అపర మానవతావాదులకు ఒక వినోదం. అక్కడి సమస్యలేమిటి? వాటికి ఎవరు కారకులు అన్నది వారికి పట్టదు. ఒక రొట్టె ముక్క కోసం ఒళ్లప్పగించేందుకు సిద్ధపడుతున్న వెనిజులా పడతులని, సిగిరెట్ పీక కోసం దేవురించే వృద్ధ్దులున్నారని వర్ణించిన మహానుభావులను చూశాము. ఇక్కడా వక్ర దృష్టే. అనేక ఆఫ్రికా దేశాల్లో ఎండు డొక్కలతో కనిపించే పిల్లలు అడుక్కోవటాన్ని, పిల్లలకోసం మానం అమ్ముకొనే తల్లులను ఈ మానవతావాదులు బహుశా చూడలేరు. చూసినా తాగిన ఖరీదైన విస్కీ మత్తు వదలి, అందమైన వర్ణనలు రావు. వెనిజులాలో సంక్షేమ పధకాలే ఈ స్ధితికి తెచ్చాయట, ఎంత కుతర్కం.
రచయిత యండమూరి వీరేంద్రనాధ్ పేరుతో 2019 నుంచి ఒక చిన్న విశ్లేషణ సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది, కొన్ని పత్రికల్లో కూడా అచ్చయింది. పదవి కోసం పెన్షన్లు, రుణ మాఫీలూ, ఉచిత సర్వీసుల ఆఫర్ ద్వారా మన నాయకులు దేశాన్ని మరో వెనిజులా చేస్తున్నారా, ఒళ్లు గగుర్పొడిచే ఈ చరిత్ర చదవండి అంటూ రాశారు. అది చరిత్రా కాదు, రాసిన వీరేంద్రనాథ్ చరిత్రకారుడూ కాదు అంటూ అప్పుడే ఈ రచయిత స్పందించాడు. ఇన్నేళ్ల తరువాత కూడా అదే ప్రచారం అటూ ఇటూ మారి జరుగుతోంది.
అమెరికాకు వెనిజులా అంటే ఎందుకు పడదు? ఎక్కడన్నా గట్టు తగాదా ఉందా లేదే? సైద్ధాంతిక, అదీ వామపక్ష ప్రభావం పెరగటాన్ని తట్టుకోలేకపోతోంది. ప్రపంచీకరణలో అమెరికా ఆధిపత్యం లోని అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్ధ లోకి ప్రవేశించకుండా వెనిజులాను అడ్డుకోవటం ఒక విద్రోహ చర్య అని వార్త రాయలేని పత్రికా స్వేచ్ఛ మనది మరి. వెనిజులా బంగారు నిల్వలను తిరిగి తీసుకొనేందుకు నిరాకరించిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ చర్య చట్టవిరుద్ధం. దోచుకోవటం...అని రాయటం కూడా కష్టమే అంటూ జర్నలిస్టు జాన్ పిల్గర్ చలోక్తి విసిరాడు. ఒళ్లు గగుర్పొడిచే పచ్చి నిజాలు ఇవి. '2008లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి, ధర పెరగని రొట్టె ముక్క అని ప్రకటించి తిరిగి అధికారం సంపాదించుకున్నాడు' ఇది హ్యూగో ఛావెజ్ గురించి రాశారు (అసలు ఆ ఏడాది ఎన్నికలే జరగలేదు).
వెనిజులాలో వున్నది వామపక్ష ప్రభుత్వం. అంతకు ముందు అక్కడ అనుసరించిన నయా ఉదారవాద విధానాలను పూర్తిగా మార్చకుండా జనానికి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకుంటున్నది. దాని ఆదాయం నూటికి 95 శాతం చమురు ఎగుమతుల మీదే ఆధారపడి వుంది. అలాంటి చమురును అమ్ముకోనివ్వకుండా అమెరికా ఆంక్షలు పెడుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పెరిగితే పరిమితం అయినా అమ్ముకుంటున్నదానికి నాలుగు డాలర్లు వస్తాయి. లేకపోతే ఇబ్బందే. ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటున్నది. వాటి నుంచి గుణపాఠాలు తీసుకొని మెరుగైన విధానాల గురించి అక్కడ మధనం జరుగుతోంది. అక్కడి జనమే వాటిని నిర్ణయించుకుంటారు. సంక్షేమ పథకాలను వ్యతిరేకించటం ప్రపంచంలో కడుపు నిండిన వారికి ఒక ఫ్యాషన్. దాన్ని సూటిగా చెబితే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ అందుకు వెనిజులాను సాకుగా చూపటమే అభ్యంతరం.
ఎం.కె.ఆర్










