ప్రజాశక్తి-తాడేపల్లి : కాషాయి పార్టీ కుటిల రాజకీయాలతో మణిపూర్‌లో అల్లర్లు చెలరేగుతున్నాయని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు విమర్శించారు. ఆదివారం తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్‌లో మణిపూర్ ఘటనను నిరసిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బోసుబొమ్మ సెంటర్‌లో పట్టణ కార్యదర్శి బూరుగ వెంకటేశ్వర్లు అధ్యక్షతన సభలో రామారావు మాట్లాడుతూ మతోన్మాదం జడలు విప్పితే ఎలాగ ఉంటుందో మణిపూర్ ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయని చెప్పారు. రెండు తెగల మధ్య మొదలైన వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించకుండా ఒక వర్గాన్ని వెంటేసుకుని మరో వర్గంపై దాడులకు తెగబడటం డబుల్ ఇంజన్ ప్రభుత్వం నిర్వాహకమని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి మోడీకి రావణకాష్టంలా రగులుతున్న మణిపూర్ గురించి పట్టించుకునే తీరిక లేదన్నారు. మహిళలను వివస్త్రలను చేసి గ్రామాల్లో ఊరేగించి అత్యాచారం చేయడం చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని ఆవేదన వెలిబుచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి మణిపూర్‌లో శాంతిని నెలకొల్పాలని, మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు, నాయకులు పి.గిరిజ, బి.విజయలక్ష్మి, కె.మేరి, సుధ, బి.దుర్గారావు, ఎస్.ముత్యాలరావు, శౌరిబర్తులం పాల్గొన్నారు.
ప్రజాశక్తి-గుంటూరు : మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించిన ఘటన జాతి యావత్తును ద్రిగ్భాంతికి గురి చేసిందని కుల నిర్మూలన సంస్థ (ఎసిఎఫ్) సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటనకు కారకులైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆదివారం గుంటూరు లాడ్జి సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఎసిఎఫ్ నాయకులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే మరోవైపు ఇలాంటి అమానుష ఘటనలు స్త్రీల ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. యావత్ దేశం తలదించుకోవాల్సిన మణిపూర్ దురాగతాలకు దేశంలో తావు ఉండకూడదని, దీని కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని చెప్పారు. కార్యక్రమంలో ఎసిఎఫ్ ఉపాధ్యక్షులు పి.కిరణ్‌కుమార్, సుజాత, అఖిల, మహాలక్ష్మి, జహీరా, ప్రగతి, దర్శి రజని పాల్గొన్నారు.










