Nov 16,2022 22:14

కళాకారుడిని బలిగొన్న రోడ్డు ప్రమాదం
కాకినాడ జిల్లాలో ఘటనతో ఉలిక్కిపడిన నారాయణపురం
ప్రజాశక్తి - ఉంగుటూరు

              వారు కళాకారులు. జాతరలు వంటి ఉత్సవాల్లో వేషాలు వేసి అందరినీ అలరిస్తూ పొట్ట నింపుకునేవారు. అదే వృత్తిపై అనకాపల్లి బయల్దేరిన కళాకారులు కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురికావడం అందరినీ కలిచివేసింది. ఈ ప్రమాదంలో ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన దుబాకుల ప్రసాద్‌ (45) మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నారాయణపురానికి చెందిన దుబాకుల ప్రసాద్‌, దుబాకుల విజరు అన్నదమ్ములు. తమ్ముడు విజరు శక్తి, కాళికాదేవి వేషాలు వేసే ప్రోగ్రామ్‌లను ఒప్పుకుంటూ కళాకారులను తీసుకెళ్లి ప్రదర్శనలు ఇస్తుంటాడు. ఇక అన్న ప్రసాద్‌ కాళికాదేవి వేషం వేయడంలో అందెవేసిన చేయి. టీమ్‌లో ప్రధాన వేషం అతనిదే. ఈ క్రమంలో అనకాపల్లిలో బుధవారం ఓ జాతర కార్యక్రమంలో వేషాల ప్రదర్శనకు 12 మంది కళాకారులను తీసుకుని మంగళవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల నుంచి టాటామేజిక్‌ వాహనంలో బయల్దేరారు. ఇటీవల ప్రసాద్‌ బావమరిది తూర్పుగోదావరి జిల్లా దొమ్మేరులో మృతి చెందగా మంగళవారం చిన కార్యక్రమానికి ప్రసాద్‌ దంపతులు వెళ్లారు. దీంతో ప్రసాద్‌ దొమ్మేరులో ఈ వ్యాన్‌ ఎక్కారు. కొంతదూరం ప్రయాణించి మల్లేపల్లి వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురై నలుగురు మృతి చెందగా వారిలో నారాయణపురానికి చెందిన ప్రసాద్‌ ఉండటం అందరినీ శోకసంద్రంలో ముంచింది. ప్రసాద్‌ మృతదేహానికి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి అనంతరం స్వగ్రామం నారాయణపురం తీసుకొచ్చారు. మృతుడు ప్రసాద్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. వేషాలు వేస్తూ మిగిలిన రోజుల్లో ఇళ్లకు రంగులు వేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ప్రసాద్‌ మరణం ఆ కుటుంబానికి తీరని లోటని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.