Jun 20,2023 01:24
కుష్టువ్యాధి నిర్మూలనా కార్యక్రమం అమలుపై సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జిల్లాలో కుష్టువ్యాధి తీవ్రతను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా అధికారులను ఆదేశిం చారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఆయన జాతీయ కుష్టువ్యాధి నిర్ములనా కార్యక్రమం అమలుపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో కుష్టువ్యాధి గ్రస్తులను గుర్తించడానికి ఈ నెల 26వ తేదీ నుంచి జులై 16వ తేదీ వరకు ఇంటింటి సర్వే చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరియు సంక్షేమ వసతి గృహాల్లో పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆయన చెప్పారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు ఇంటింటి సర్వే చేయాలన్నారు. అనుమానం ఉన్న వారిని మెడికల్‌ ఆఫీసర్‌ వద్ద తీసుకుని వెళ్లాలన్నారు. మెడికల్‌ ఆఫీసర్లు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ విజయమ్మ, జిల్లా కుష్ఠు నివారణ అధికారి సివి రమాదేవి, డిపిఎంఓ డాక్టర్‌ రమాదేవి, జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి రాజ్‌ దెబోరా, మలేరియా అధికారులు పాల్గొన్నారు.