Nov 17,2023 23:55

అవగాహన కల్పిస్తున్న డాక్టర్‌ నంది విమలగిరి, వైద్య సిబ్బంది

ప్రజాశక్తి-మునగపాక రూరల్‌
మండలంలోని మూలపేట గ్రామంలో కుష్టు వ్యాధిపై అవగాహన సదస్సు ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్‌ నంది విమలగిరి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ విలమగిరి మాట్లాడుతూ స్పర్శ లేని, రాగి రంగులో ఉండే మచ్చ వున్నచో సంబంధిత ఆశా, ఏఎన్‌ఎం, ఎమ్మెల్‌హెచ్‌పిలను సంప్రదించాలని సూచించారు. వ్యాధి గురించి ఆందోళన చెందనవసరం లేదని పేర్చొన్నారు. కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ ఆర్‌.దేవకాంత మాట్లాడుతూ కుష్టు రహిత భారత దేశాన్ని తొందరలోనే చూస్తామన్నారు. ఈ వ్యాధిపై అవగాహన పెంచుకొని, అపోహలు లేకుండా వ్యాధిగ్రస్తులకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. ఒకవేళ ఎవరికైనా 5 లోపు మచ్చలు ఉంటే 6 నెలలు, 5 కన్న ఎక్కువ మచ్చలు ఉంటే సంవత్సరం పాటు ప్రభుత్వం వారికి మందులను ఉచితంగా అందజేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు విఎస్‌ఎం లక్షి, ఎంఎ ఉమా మహేష్‌, ఎమ్మెల్‌హెచ్‌పి యామిని ప్రియ, ఏఎన్‌ఎం రమణి, హెల్త్‌ అసిస్టెంట్‌ యస్‌ విశ్వనాధం, ఆశా కార్యకర్తలు రూప, పద్మావతి పాల్గొన్నారు.