Oct 09,2023 20:59

తహశీల్దార్‌కు వినతి అందజేసేందుకు వచ్చిన కుష్టురోగులు

ప్రజాశక్తి-బొబ్బిలి :   కుష్టు రోగుల భూములపై ప్రభుత్వం కన్ను పడింది. 1961లో కుష్టు రోగుల కోసం 12.60 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రభుత్వం కేటాయించిన కొంత భూమిలో ఇళ్లు నిర్మించుకుని ఆ కాలనీకి ప్రేమనగర్‌ కాలనీగా నామకరణం చేశారు. ప్రేమ సమాజం లెప్రసీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేశారు. కుష్టు రోగులు పనులు చేసుకునే అవకాశం లేకపోవడంతో పట్టణంలో భిక్షాటన చేసుకుని ఆ కాలనీలో జీవనం సాగిస్తున్నారు. ఖాళీగా ఉన్న 4.71 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం బోర్డులు ఏర్పాటు చేయడంతో కుష్టు రోగులు, ప్రేమనగర్‌ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐటిఐ కాలనీకి ఎదురుగా 12.60 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయిస్తే, కొంత భూమిలో కుష్టు రోగులు ఇళ్లు నిర్మించుకున్నారు. మిగిలిన భూమి ఇతర అవసరాలకు రిజర్వ్‌గా ఉంచారు. ప్రేమనగర్‌కాలనీ వద్ద మల్లమ్మపేట రెవెన్యూలో సర్వే నంబర్‌ 218-ఎలో 4.71 ఎకరాలు ఖాళీగా ఉంది. కొన్నేళ్లుగా ఆ భూమి ఖాళీగా ఉండడంతో బుడా ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంకు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేశారు. రాష్ట్రీయ రహదారి పక్కనే భూమి ఉండడంతో పెట్రోల్‌ బంకు ఏర్పాటుకు బుడా ప్రతిపాదనలు చేయడంతో కౌన్సిల్‌ తీర్మానం చేసేందుకు మున్సిపల్‌ సమావేశంలో అజెండా పెట్టారు. కానీ, ఆ వార్డు కౌన్సిలర్‌ తెంటు పార్వతి వ్యతిరేకించడంతో తీర్మానాన్ని ఆమోదించకుండా వాయిదా వేశారు. దీంతో ఖాళీగా ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవాలని అధికార పార్టీ నాయకులు రెవెన్యూ అధికారులకు సూచించారు. సర్వే చేసిన అధికారులు ఖాళీగా ఉన్న 4.71 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు అక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో నాలుగేళ్లలోపు ఎటువంటి నిర్మాణాలూ చేయకపోతే వెనక్కి తీసుకునే హక్కు ఉండడంతో ఆ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు రెవెన్యూ అధికారులు ప్రకటించారు.
భూమి లాక్కోవడంపై ఆగ్రహం
1961లో ఇచ్చిన భూమిని ప్రభుత్వం లాక్కోవడంపై కుష్టు రోగులు, ప్రేమనగర్‌ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్ణయంపై ప్రేమ సమాజం లెప్రసీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సర్కార్‌ ప్రభావతి, కాలనీ వాసులు సీతమ్మ, పి.పైడమ్మ, అంజమ్మ, వై.రాములమ్మ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములను భవిష్యత్తు అవసరాలకు ఉంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమ భూములను తీసుకోవద్దని తహశీల్దార్‌ డోల రాజేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. తమకు కేటాయించిన భూమిని అలాగే ఉంచాలని కోరారు.