ప్రజాశక్తి-కొల్లూరు: గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు పసుపు, కంద పంటలకు చాలా ఉపయోగమని రైతులు చెబుతున్నారు. కొల్లూరు మండల పరిధిలోని లంక గ్రామాల్లో పసుపు కంద ఎక్కువగా సాగు చేస్తారని అన్నారు. గత సంవత్సరం పసుపుకు, కందకు గిట్టుబాటు ధర లేనప్పటికీ రైతుల్లో ఈ రెండు పంటల పట్ల ఆసక్తి తగ్గలేదు అందువలన చాలా మది రైతులు ఈ సంవత్సరం కూడా పసుపు, కంద సాగు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని అన్నారు. కంద మే నెలలో పొలాల్లో చేస్తారు. పసుపు జూన్ జూలై నెలల్లో పొలాల్లో వేస్తారు. ఈ రెండు పైర్లు మొలక దశలో ఉన్నప్పుడు ఈ వర్షాలు పడటం వలన చాలా ఉపయోగకరమని రైతులు చెబుతున్నారు. ఒక ఎకరంలో పసుపు వేయాలంటే 20 బస్తాలు కావాలి బస్తా అంటే(66) కేజీలు ఎకరంలో పసుపు పండించాలంటే కనీసం 40 నుంచి 50 వేలు ఖర్చవుతోందని అన్నారు. పసుపు బాగా ఊరితే ఒక ఎకరానికి ఎండి పసుపు 30 కింటాలు దిగుబడి వస్తుంది. గత ఏడాది ఏప్రిల్, మే నెలలో పసుపు ధర క్వింటా రూ.4000 వేల నుంచి రూ.5000 వేలు పలకగా ఇప్పుడు జులై నెలలో రూ.13,000 పలుకుతోంది. ఇప్పుడు ఉన్న రేట్లు ప్రకారమైతే ఒక ఎకరానికి మూడు లక్షలు ఆదాయం వస్తుంది. కంద ఒక ఎకరంలో వేయాలంటే 20 పుట్లు కావాలి. పుట్టంటే 250 కేజీలు ఒక ఎకరంలో కంద బాగా పండితే 60 నుంచి 70 పుట్లు దిగుబడి వస్తుంది. ఒక ఎకరం కంద పండించాలంటే 70 వేలు ఖర్చు అవుతుంది. గత ఏడాది డిసెంబర్ జనవరి నెలలో కందధార పుట్టు రూ.3000 వేలు రూ.4000 వేలు పలకగా జూన్ నెలలో రేటు రెండు రెట్లు పెరిగి రూ.10,000 పలికింది. ఈ విధంగా రేటు ఉంటే రైతుకు ఒక ఎకరానికి ఐదు నుంచి ఆరు లక్షల ఆదాయం వస్తుంది. ఈ రెండు పైర్లకి రైతుల దగ్గర సరుకు అయిపోయిన తర్వాత రేట్లు పెరగడం వలన రైతులు చాలా నిరుత్సాహపడుతున్నారు.










