కురుపాం: కురుపాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మూడుముక్కలాటకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఎట్టకేలకు తెరపడినట్టు విశ్వాసనీయ సమాచారం. బుధవారం తోటపల్లి ప్రాజెక్టు పరిశీలనకు వచ్చి అనంతరం గురువారం పార్వతీపురంలో కురుపాం నియోజకవర్గ టిడిపి నాయకులతో జరిగిన సమావేశంలో అందరూ కలిసి ఇన్‌ఛార్జి జగదీశ్వరికి గెలుపునకు కృషి చేయాలని చెప్పి అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థిగా జగదీశ్వరిని ప్రకటించినట్లు సమాచారం. అంతవరకు బాగానే ఉన్నా ఆమె ప్రకటనపై ఆమె వర్గమంతా హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇప్పుడే అసలు కథ మొదలయ్యింది. ఇటు టిడిపి టిక్కెట్ ఆశిస్తున్న దత్తి లక్ష్మణరావు గ్రూపులోని ఐదుగురు ఆశావాసులు, మిగతా నాయకులు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఆమెతో కలిసి పని చేస్తారా లేదో అనేది వేచి చూడాల్సి ఉంది.










