
ప్రజాశక్తి -భీమునిపట్నం : డివిజన్ పరిధిలో ప్రస్తుతం కురిసిన వర్షంతో రైతాంగంలో ఒకింత ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటి వరకు అనుకూలమైన వాతావరణం లేక భీమిలి మండలం కాపులుప్పాడ, సింగనబంద, మజ్జివలస, మజ్జిపేట, ఆనందపురం మండలం గిడిజాల, తర్లువాడ, గొట్టిపల్లి, పద్మనాభం మండలం బిఆర్.తాళ్లవలస, ఐనాడ, రేవిడి తదితర గ్రామాల్లో ఇప్పటి వరకూ ఉడుపులు పడని పరిస్థితి ఉంది. ఆయా గ్రామాల్లో వేసిన నార్లు 45 నుంచి 50 రోజుల వయసులో ఉన్నాయి. ప్రస్తుతం కురిసిన వర్షాలకు పూర్తి స్థాయిలో ఉడుపులు చేసేందుకు రైతాంగం సమాయత్తం అవుతోంది.
భీమిలి మండలంలో వరి పంట సాధారణ విస్తీర్ణం 1326 ఎకరాలు కాగా, ఇప్పటి వరకు సుమారు 500 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఆనందపురం మండలంలో వరి పంట సాధారణ విస్తీర్ణం 1563 ఎకరాలు కాగా సుమారు 870 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. పద్మనాభం మండలంలో వరి పంట సాధారణ విస్తీర్ణం 6,229 ఎకరాలు కాగా సుమారు 5300 ఎకరాల్లో వరి నాట్లు వేశారు.