ప్రజాశక్తి - ఆదోని
ఆకాశాన్నంటిన నిత్యావసర, కూరగాయల ధరలు నియంత్రించాలని యువజన కాంగ్రెస్ ఆదోని నియోజకవర్గ బాధ్యులు నీలకంఠప్ప, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి రావు, పట్టణ కార్యనిర్వహణ అధ్యక్షులు దిలీప్ ఢోకా డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదోని రైతు బజార్ ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా టమోటా ధర కిలో రూ.150లకు చేరుకోవడం బిజెపి పాలన అసమర్థతను ఎత్తి చూపిస్తోందని విమర్శించారు. ధరలు పెరుగుతున్నా నోరు మెదపకపోవడంపై దేశ ప్రధానిగా మోడీ గరీబోళ్ల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. మిర్చి ధర ఎంత ఘాటుగా ఉందంటే వినియోగదారుని గుండెల్లో దడ పుట్టించే అంతలా ఉందన్నారు. కర్నూలులో టమోటా ధరకు సబ్సిడీ ఇస్తుంటే ఆదోనిలో ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దీనిపై దృష్టి సారించాలని కోరారు. పట్టణ కార్యదర్శి సాయినాథ్, యువజన నాయకులు దేవిశెట్టి వీరేష్, నాయకులు మనియార్ ఇర్ఫాన్, శ్రీనిత్, మద్దిలేటి, మాణిక్య రాజు, షేక్షావలీ, పీర్ సాబ్, రాము పాల్గొన్నారు.
నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులు










