కూరగాయల ధరలను అదుపు చేయాలి : సిపిఎం
ప్రజాశక్తి-కావలి : విపరీతంగా పెరిగిపోయిన కూరగాయల ధరలను వెంటనే అదుపు చేయాలని, సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. కావలి రైతు బజార్‌లో సిపిఎం నాయకులు సోమవారం సందర్శించి, అక్కడున్న ఎస్టేట్ అధికారి బి.స్వరూపను కలిసి, కూరగాయల ధరలు పెరుగుదలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ కూరగాయలు ధరలు వారం రోజుల నుండి ఆకాశమంటుతున్నాయన్నారు. కూరగాయలు ధరలు టమోటా రూ.96, పచ్చిమిర్చి రూ.100, బీన్సు చిక్కిళ్లు రూ.100, చిక్కుళ్లు రూ.90, బీరకాయ రూ.70 ఈ ప్రకారం అన్ని కూరగాయల రేట్లు పెరిగి ఉన్నాయన్నారు. ఈ ధరలతో ప్రజలు కొని తినలేని పరిస్థితి ఉన్నదని ధరలు అదుపు చేయడంలో ప్రభుత్వం అధికారులు విఫలమవుతున్నారన్నారు. గత శనివారం ఒక్కరోజు మాత్రం టమోటాలు సబ్సిడీ రేటుకు రూ.50లకు కొంత మందికి మాత్రమే ఇచ్చి, చేతులు దులుపుకోవడం చాలా అన్యాయమన్నారు. ఇప్పటికే అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఈ పరిస్థితుల్లో కూరగాయలు ధరలు పెరిగినందున ఇంకా ప్రజలు ఇబ్బంది పడాల్సివస్తుందన్నారు. ప్రజలు ఇబ్బందులు ప్రభుత్వానికి అధికారులకు వారి గోడు పట్టటం లేదన్నారు. ఇలా ప్రజలపై భారాల మీద భారాలు మోపుతుంటే ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. పెరిగిన కూరగాయల ధరలను వెంటనే అదుపు చేయాలని, పెరిగిన కూరగాయలను ప్రభుత్వం సబ్సిడీ రేటుకు ప్రతిరోజూ ప్రజలకు అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వై.క్రిష్ణ మోహన్, జి.మధుసూదనరావు, సిఐటియు నాయకులు టి.రత్నం, డివైఎఫ్‌ఐ నాయకులు మదన్, తదితరులు పాల్గొన్నారు.










