ప్రజాశక్తి - హోళగుంద
కూరగాయల ధరలు పైపైకి వెళ్తుండడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. కూరగాయల ధరలు ఇలా మండిపోతుంటే ఏం కొనలేం.. తినలేమంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రతేడాది మేలో వర్షాలు కురవగా అక్కడక్కడ వంకాయ, టమోటా మాత్రమే రైతులు పండించేవారు. ఈ ఏడాది జూన్ నెలాఖరు వచ్చినా వర్షాలు కురవలేదు. బోరుబావుల కింద పండించడానికి ఎండ తీవ్రత అధికంగా ఉండడం, విద్యుత్ కోతలు ఉండడంతో ఏ రైతు కూడా కూరగాయలు పండించడానికి మొగ్గుచూపలేదు. ధరలు అమాంతంగా పెరిగి సామాన్యులకు భారంగా మారాయి. టమోటా కిలో రూ.50, బీరకాయ కిలో రూ.60, వంకాయ కిలో రూ.50, పచ్చిమిర్చి కిలో ఏకంగా రూ.100 దాటిపోయింది. ఆకుకూరలు కొత్తిమీర ఒక కట్ట రూ.20 పలుకుతోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పక్క రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతి
రాష్ట్రంలో వర్షాలు లేక కూరగాయలు పండించే రైతులు లేకపోవడం వల్ల పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ తదిత రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలో చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు. రవాణా చార్జీలు పెరిగి కూరగాయల ధరలు పెరిగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు.
ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
కూరగాయల ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దళారులు కమీషన్లకు కక్కుర్తి పడడం వల్ల ధరలు పెరుగుతున్నాయని వినియోగదారులు పేర్కొంటున్నారు. ఎంత రవాణా చార్జీలు పెరిగినా ఎప్పుడూ ఇలాంటి ధరలు లేవని చెబుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కూరగాయల ధరలను నియంత్రణలో ఉంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నారు.
హోళగుంద కూరగాయల మార్కెట్










