మదనపల్లె అర్బన్ : కురబలు ఐకమత్యంగా ఉండాలని, కలసి కట్టుగా పోరాడి రాజ్యాధికారం సాధించుకోవాలని మదనపల్లె, తంబళ్లపల్లె కురబ సంఘం అధ్యక్షులు కప్పల రాజన్న, గుడే శ్రీనివాసులు తెలిపారు. సోమవారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆరేళ్లుగా కురబ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు నేతత్వంలో కురబకుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కనకదాసు జయంతి ఉత్సవ ముగింపు సభను నిర్విహించామని గుర్తు చేశారు. కురబలను ఎస్టీలో చేర్చాలనే డిమాండ్‌తో డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలు చేశామని వెల్లడించారు. జబ్బల శ్రీనివాసులు ఆధ్వర్యంలో కురబకులానికి మంచి జరుగుందని తమకు నమ్మకం ఉందన్నారు. కొందరు కురబలను విడదీసే విధంగా కొత్త సంఘం ఏర్పాటు చేసినట్లు తమకు తెలిసిందని దీనివల్ల అందరం నష్టపోవలసి వస్తుందని విమర్శించారు. అందరూ కలసి కట్టుగా పోరాడితేనే ఏదైనా సాధ్యం అవుతుందని ఆదిశగా అందరూ ఆలోచన చేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కురబలకు చట్టసభల్లో ప్రాముఖ్యత కల్పించేవిధంగా పోరాటం చేయడానికి కలసి రావాలని కోరారు. కులం అనేది ఒక కుటుంబం లాంటిదని దానిలో తప్పు ఒప్పులు ఉంటే కూర్చుని సరిదిద్దుకోవాలే తప్ప విడిపోకూడదన్నారు. సమావేశంలో గుడి రామాంజులు, రాజ్ కుమార్, వెంకట రమణ, భగవాన్ పాల్గొన్నారు.










