ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్
కుప్పం అంగన్‌వాడి ప్రాజెక్టులో నిత్యం అంగన్‌వాడీలను వేధిస్తున్న సిడిపిఒపై చర్యలు తీసుకోవాలని సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు, అంగన్‌వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కే లలిత, జిల్లా ఉపాధ్యక్షురాలు ప్రమీల మాట్లాడుతూ కుప్పం ప్రాజెక్టు అధికారి తమ సమస్యలను పరిష్కరించకుండా తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నారు. గత నెల 25న చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సందర్భంలో కుప్పం నుంచి అందరూ బయలుదేరి వెళ్ళగా మధ్యలో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ అరెస్టులకు నిరసనగా 25న కుప్పంలో రాస్తారోకో నిర్వహించి కుప్పంలో ఉన్న ఎమ్మెల్సీ శ్రీకాంత్ కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లగా ఇదే అదునుగా చూపి పార్టీ మీటింగ్ కు అంగన్వాడీలు వెళ్లారని షోకాజ్ నోటీసులు ఇచ్చారన్నారు. సమాధానం ఇచ్చినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే 50 మందికి వేతనాల కోత విధిస్తూ, ఇద్దరు నాయకులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు నోటీసులు పంపారన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకొని తప్పుడు పద్ధతిలో వేధింపులకు గురిచేస్తున్న కుప్పం ప్రాజెక్టు అధికారిపై చర్యలు తీసుకోకపోతే జిల్లా, రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీసుకెళ్తామని హెచ్చరించారు.
భూకబ్జాదారులపై చర్యలు తీసుకోండి
తమ తండ్రి నుంచి, సంక్రమించిన వ్యవసాయ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని కబ్జాకు పాల్పడుతున్న వారిపై చర్యలు చేపట్టాలని పెనుమూరు మండలం కలికిరి గొల్లపల్లికి చెందిన బాధితులు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ సగిలి సన్మోహన్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాధిత సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ కలికిరి గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబర్ 10/1 కి సంబంధించిన 3.61 సెంట్ల భూమిని తమ గ్రామానికే చెందిన మురళి, జగన్నాథం, మారకొండయ్య, లోకేష్ , చలపతి, రామమూర్తి, వెంకటేష్ అక్రమంగా కబ్జాకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చెందిన భూమిపై 2021 నుంచి ఇప్పటి వరకు చిత్తూరు, జాయింట్ కలెక్టర్, రాష్ట్ర హైకోర్టులలో కేసులు నడుస్తున్నాయని తెలిపారు. భూమిలోకి ఎవరు ప్రవేశించకుండా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చినా రాజకీయ నాయకుల అండదండలతో... పెనుమూరు మండల తాసిల్దార్, మండల పోలీసు అధికారులు సైతం కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారన్నారు. తమ భూమిని జెసిబితో చదును చేస్తూ అక్రమంగా కబ్జాకు పాల్పడుతున్నారని, కోర్టు ఉత్తర్వుల మేరకు తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.
'స్పందన'కు 347 అర్జీలు
స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.షన్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే స్పందనలో భాగంగా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, జడ్పీ సి ఈ ఓ ప్రభాకర్ రెడ్డి తో కలసి అర్జీలను స్వీకరించారు. మొత్తం 347 అర్జీలు అందాయి. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవే 258 ఉండటం గమనార్హం.










