ప్రజాశక్తి - పలమనేరు
కుప్పం ప్రాజెక్టులో అంగన్‌వాడీలను వేధిస్తున్న సిడిపిఒను సస్పెండ్ చేయాలని గురువారం పలమనేరు ప్రాజెక్టు అధికారికి సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వాడ గంగరాజు, అంగన్‌వాడీ వర్కర్స్‌యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ కుప్పం ప్రాజెక్టులో రోజురోజుకీ వర్కర్లపై వేధింపులు తీవ్రస్థాయికి చేరాయన్నారు. వీటిని ప్రశ్నిస్తున్న నాయకురాలు ప్రమీలను మరో కార్యకర్త కవితలను విధుల నుంచి తొలగించడం దుర్మార్గమన్నారు. అక్రమంగా తొలగించిన వీరిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిడిపిఒ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ వర్కర్లను బూతులు తిడుతూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. శుక్రవారం కుప్పంలో అంగన్‌వాడీల నిరసన ఉంటుందన్నారు. కుప్పం సిడిపిఒపై చర్యలు తీసుకోకపోతే పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సంఘం జిల్లా కార్యదర్శి ఓబుల్ రాజు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, పలమనేర్ సిఐటియు నాయకులు గిరిధర్ గుప్తా, సుబ్రహ్మణ్యం, అంగన్వాడీ యూనియన్ నాయకులు పద్మ తదితరులు పాల్గొన్నారు.










