
షాహి ఎక్స్‌పోర్ట్స్ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో తయారవుతున్న జర్కిన్లు, ప్యాంట్లు, షార్ట్స్ లాంటి దుస్తులు వంద శాతం విదేశాలకు ఎగుమతి అవుతాయి. ఈ ఫ్యాక్టరీలో 2500 మంది మహిళా కార్మికులు, 500 మంది పురుషులు పని చేస్తూ తమ రెక్కల కష్టంతో యాజమాన్యానికి లాభాలు తెస్తున్నారు. వీరికి నెలకు రూ. 9250 మాత్రమే యాజమాన్యం చెల్లిస్తుంది. ఇందులో ప్రావిడెంట్ ఫండ్, ఇ.ఎస్.ఐ. వాటాలు మినహాయిస్తే చేతికి రూ. 8000 అందుతుంది. కార్మిక చట్టాల ప్రకారం ఇప్పటి దాకా కార్మికులకు యాజమాన్యం ఇవ్వాల్సిన పి.ఎఫ్ స్లిప్, ఇ.ఎస్.ఐ కార్డులు, అపాయింట్‌మెంట్ లెటర్, శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తూ లెటర్ కూడా ఇవ్వలేదు. కార్మిక శాఖ, సంబంధిత అధికారులు చట్టపరంగా కార్మికుల సమస్యలను పట్టించుకొన్న పాపాన పోలేదు.
షాహి ఎక్స్‌పోర్ట్స్‌ను ప్రముఖ కార్పొరేట్ ఆహుజ కంపెనీ 1974లో స్థాపించింది. మన దేశంలోని 9 రాష్ట్రాల్లో 65 ఫ్యాక్టరీలు, 3 ప్రాసెసింగ్ మిల్లులను నిర్వహిస్తూ అతి పెద్ద దుస్తుల తయారీ సంస్థగా ఎదిగింది. ఈ ఫ్యాక్టరీల్లో 67000 మహిళలతో సహా లక్ష మంది కార్మికులు పనిచేస్తున్నారు. 2018 సంవత్సరంలో టర్నోవర్ రూ. 500 కోట్లు దాటింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో షాహి ఎక్స్‌పోర్ట్స్ గార్మెంట్స్ ఫ్యాక్టరీని అప్పటి ముఖ్యమంత్రి, కుప్పం నియోజకవర్గ శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు 2016వ సంవత్సరంలో అట్టహాసంగా ప్రారంభించారు.
అమెరికన్ ఈగల్, స్పెన్సర్స్, వాల్‌మార్ట్స్, అమెజాన్ లాంటి సంస్థలకు వివిధ రాష్ట్రాల్లో తయారవుతున్న 50 రకాల దుస్తులను ఎగుమతి చేస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నది. ఢిల్లీ కేంద్రంగా ఆహుజ కుటుంబానికి చెందిన ప్రయివేటు కంపెనీగా వ్యాపారం చేస్తున్నది.
వీరికి చెందిన బెంగళూరు యూనిట్‌లో 3000 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో మహిళా కార్మికులు ఎక్కువ. ఇక్కడ కూడా కార్మికుల కష్టాలకు తగ్గట్టు గౌరవప్రదమైన వేతనాలు లేవు. శ్రమ దోపిడీ జరుగుతున్నది.
కుప్పం గార్మెంట్స్ ఫ్యాక్టరీలో మూడు సంవత్సరాలుగా వేతనాలు పెంచకపోగా పని గంటలు పెంచేస్తున్నారు. మహిళా కార్మికులపై వివిధ రకాల వేధింపులు సరేసరి. మహిళలంటే ఏమాత్రం గౌరవం లేని ఫ్యాక్టరీ నిర్వాహకులు ఆడిందే ఆట పాట చందంగా ఉంది. 2012 సంవత్సరంలో ఎ.పి ప్రభుత్వం గార్మెంట్స్ కార్మికులకు నిర్ణయించిన వేతనాలు, కరువు భత్యాన్ని కుప్పంలో చెల్లిస్తున్నామని కార్మికులను దగా చేస్తున్నది. గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం గార్మెంట్స్ కార్మికులతోబాటు ఇతర షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్లలో కనీస వేతనాలు పెంచకుండా కార్మికులను మోసం చేస్తున్నది.
కుప్పం ఫ్యాక్టరీలో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన కార్మిక శాఖ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు కూడా అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మహిళలను కించపరిచే విధంగా యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతుంటే అడిగే దిక్కు లేకుండా పోయింది.
కుప్పం లోని షాహి యాజమాన్యం గత మూడు సంవత్సరాలుగా వేతనాలు పెంచక పోవడంతో కడుపు మండి మే 9 నుండి యావత్తు కార్మికులు మెరుపు సమ్మెకు పూనుకున్నారు. ఎన్ని ఒత్తిడులు వచ్చినప్పటికి కార్మికులు 5 రోజుల సమ్మె చేశారు. యాజమాన్యం కార్మికుల మొర ఆలకించలేదు. సమ్మెను వెంటనే విరమించి ఉద్యోగం లోకి చేరకపోతే తొలగిస్తామని యాజమాన్యం బెదిరించినప్పటికి యూనియన్ లేకపోయినప్పటికీ కార్మికులు మొక్కవోని దీక్షతో సమ్మెను కొనసాగించారు.
కార్మికులకు కనీస వేతనం రూ. 15000 ఇవ్వాలని కోరుతూ సమ్మె చేస్తున్న కార్మికులు కుప్పం పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతు కోరారు. యాజమాన్య ప్రతినిధుల సమక్షంలో మాట్లాడుతూ యూనియన్ పెట్టుకోవద్దని, సమస్యల పరిష్కారానికి స్థానిక తెలుగుదేశం నాయకుల సహకారాన్ని తీసుకోవాలని చెప్పారే కానీ వేతనాలు పెంచాలని యాజమాన్యానికి చెప్పలేదు. దాంతో కార్మికులు నిరాశతో వచ్చేశారు. యాజమాన్య ప్రతినిధులు మాత్రం చంద్రబాబు సమక్షంలో జూన్ నెలాఖరుకు కార్మికులకు గ్రేడ్లు నిర్ణయించి వేతనాలు పెంచుతామని సమ్మెను విరమించాలని హుకుం జారీ చేశారు.
వేతనాలు పెంచాలని కార్మికులు చేస్తున్న సమ్మెను గమనించిన సిఐటియు జిల్లా కేంద్రం, కుప్పం మండల సిఐటియు నాయకత్వం, అంగన్వాడీ, వి.ఓ.ఏ. మునిసిపల్ యూనియన్ నాయకత్వం గార్మెంట్స్ కార్మికుల సమ్మెకు అండగా నిలబడింది.
ఇకపోతే అధికార వైఎస్‌ఆర్‌సిపి నాయకుల జోక్యం తూతూ మంత్రంగా వుందే తప్ప వేతనాలు పెంచాలని యాజమాన్యాన్ని నిలదీయలేదు. గత్యంతరం లేక కార్మికులు అయిష్టంగానే సమ్మెను విరమించారు.
సమ్మె తర్వాత పనిలోకి వెళ్లిన కార్మికులపై మరింతగా వేధింపులు ప్రారంభమయ్యాయి. ఈ దోపిడీ, వేధింపులు భరించడానికైనా ఒక పరిమితి వుంటుందికదా!
/ వ్యాసకర్త : సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, చిత్తూరు.
సెల్ : 9490300770 /
పి.చైతన్య