Aug 05,2023 22:56

కునుకు కరువాయే...!

* పెరుగుతున్న నిద్రలేమి బాధితులు
* యుక్త వయు వారిలో ఆందోళనకర స్థాయి
* అతిగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగమే కారణం
* జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు
ప్రజాశక్తి - శ్రీకాకుళం : ఆకలి రుచి ఎరుగదు... నిద్ర సుఖమెరుగదు అనేది నానుడి. కంటి నిండా నిద్రపోతే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కానీ ప్రస్తుత సమాజంలో నిద్రపట్టకపోవడం సమస్యగా పరిణమిస్తోంది. బెడ్‌ రూమ్‌లో సకల సౌకర్యాలున్నా, కంటి మీద కునుకు రావడం లేదనే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రశాంతంగా నిద్రపట్టక ఎంతోమంది విలవిల్లాడుతున్నారని నిపుణులు చెప్తున్నారు. జీవనశైలిలో మార్పులతో నిద్రలేమి సమస్యలు పెరుగుతున్నాయంటున్నారు. నగరంలో ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారిలో ఎక్కువ మంది 40 ఏళ్లలోపు వారేనని చెప్తున్నారు.

     నిద్రలేమితో వైద్య నిపుణులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరిగింది. వీరిలో విద్యార్థులు, ఉద్యోగులు, మధ్య వయస్కుల వారు ఉంటున్నారు. గతంతో పోలిస్తే యువత ఈ సమస్య బారిన పడుతుండడం ఆందోళనకరమని నిపుణులు పేర్కొంటున్నారు. చికాకు, కోపం, ఇరిటేషన్‌ తదితర లక్షణాలు వారిలో కనిపిస్తున్నాయని, తలనొప్పితో బాధపడుతున్నారని చెప్తున్నారు.

నిద్ర సమస్యకు కారణాలు ఇవే...
     నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వారిలో 80 శాతం మంది సెల్‌ఫోన్‌ చూస్తూ ఉండడం, రోజులో పది గంటలకు పైగా కంప్యూటర్‌, ట్యాబ్‌, స్మార్ట్‌ ఫోన్‌ వినియోగిస్తుండడమే కారణమంటున్నారు. గంటల తరబడి సెల్‌ఫోన్‌ వినియోగించే యుక్త వయస్కుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని చెప్తున్నారు. మరికొందరిలో అవసరానికి మించిన ఆలోచనలు, ఆర్థికపరమైన ఇబ్బందులు కారణంగా పేర్కొంటున్నారు. నిద్రలేమితో బాధపడే ప్రతి ఐదుగురిలో నలుగురి సమస్యకు సెల్‌ఫోన్‌, కంప్యూటర్‌, ట్యాబ్‌ వంటి ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ అతి వినియోగమే కారణంగా తేలిందంటున్నారు.
బైక్‌ నడుపుతున్నప్పుడు ఏకాగ్రత కోల్పోయినా, చిన్న విషయానికి కోపం, చిరాకు వస్తున్నా... క్రమేణా ఊబకాయులుగా మారుతున్నా... ఆందోళనగా అనిపిస్తున్నా.. నిద్రలేమి గానే భావించాలి. ఈ తరహా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. పగలంతా కష్టపడి పనిచేసిన శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో, మెదడుకు కూడా అంతే విశ్రాంతి అవసరం. మనిషి శరీరతత్వాన్ని బట్టి రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం.

ఇబ్బందులు ఇవీ...
       నిద్రలేమితో బాధపడే వారిలో అనేక సమస్యలు తలెత్తుతాయి. అలసట, పనిపై దృష్టిసారించలేకపోవడం, ఏకాగ్రత తగ్గడం, చికాకు, కోపం, హైపర్‌ టెన్షన్‌, షుగర్‌, ఒబేసిటీ, మానసిక ఒత్తిడి, జ్ఞాపకశక్తి కోల్పోవడం ప్రధానమైనవి. కొందరిలో తీవ్రమైన తలనొప్పి, కళ్లల్లో మంట, ఇరిటేషన్‌ వస్తుంటాయి. కారు, బైక్‌పై వెళ్లేటప్పుడు ఎవరైనా ఎదురుగా వస్తే కంగారు, ఆలోచనల్లో మార్పు, చిన్న విషయానికే ఆందోళనకు గురవడం, వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి సమస్యలకు గురువుతున్నారు. అనేక మందిలో లైంగిక సామర్థ్యం దెబ్బతింటోంది.

నిద్రకు చిట్కాలు
       నిద్రపోయే ప్రదేశంలో చీకటిగా ఉండాలి. వెలుతురు కళ్లపై పడకుండా జాగ్రత్త వహించాలి. వీలైనంత వరకు నిద్రకు ఉపక్రమించే గంట ముందుగానే టివి, సెల్‌ఫోన్‌, కంప్యూటర్లకు దూరంగా ఉండాలి. టీ, కాఫీలు తాగకూడదు. యోగా, నడక, వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. మెడిటేషన్‌తో శరీరంపై పట్టు సాధించాలి. అనవసర ఆందోళనలు వీడాలి. మంచి పుస్తకం చదువుతూ ఉపక్రమిస్తే గాఢ నిద్ర పడుతుంది. ఇంట్లో వైఫై కనెక్షన్‌ ఉంటే రాత్రి ఎనిమిది గంటలకే ఆఫ్‌ చేయాలి.

ఎక్కువ మందిలో సమస్య
        నిద్ర రావడం లేదని ఎక్కువ మంది వస్తున్నారు. దీనికి కారణాలు ఏమిటని తెలుసుకుంటే అతిగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగమేనని తేలింది. మరికొందరిలో అనవసర ఆలోచనలు, పనిఒత్తిడి, తెల్లవారుజాము వరకు నిద్రపోకవడం కారణాలు. ఆరోగ్యవంతమైన జీవనానికి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అవసరం. చాలామంది ఐదు గంటలు కూడా విశ్రాంతి తీసుకోవడం లేదు. దీంతో నిద్రపట్టకపోవడమనే సమస్య ఎదురవుతుంది. ఎన్ని పనులున్నా రాత్రి 11 గంటల్లోగా పూర్తి చేసుకోవాలి. రాత్రిళ్లు ఉద్యోగాలు చేసేవాళ్లు పగటి పూట ఇతర వ్యాపకాలు పెట్టుకోకుండా ఎక్కువ సమయం నిద్రపోవాలి.
- డాక్టర్‌ సాయిలహరి, మానసిక వైద్యులు
  జెమ్స్‌ హాస్పిటల్‌, రాగోలు