Apr 26,2023 00:25

మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కమార్‌

ప్రజాశక్తి-పాడేరు:జిల్లా కుటుంబ నియంత్రణ పట్ల గిరిజనులకు పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా కలక్టర్‌ సుమిత్‌ కుమార్‌ సూచించారు. మంగళవారం కలక్టరేట్‌ సమావేశ మందిరంలో పాడేరు డివిజన్‌ ఫరిధిలో 11 మండలాల ఐసిడిఎస్‌ సిడిపిఓలు, సూపర్వైజర్లతో నిర్వహించిన సమావేశంలో రక్తహీనతపై ఆరా తీసిన కలెక్టర్‌ మాట్లాడుతూ, కుటుంబ నియంత్రణ చేసుకోవడం తో లాభాలపై అవగాహన కల్పించాలన్నారు. పునరుత్పత్తి హక్కు అయినందున, ఎవరినీ బలవంతం చేయరాదని, వారికి అవగాహన కల్పించి వారి నిర్ణయానికే విడిచి పెట్టాలని సూచించారు. జిల్లాలో అనేకమంది పిల్లలు, గర్భిణీలు, బాలింతలు రక్త హీనతతో భాద పడుతున్నారని, అటువంటి వారిని గుర్తించి వారికి తగు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, చికిత్సలు అందించాలన్నారు. ముఖ్యంగా ఐరన్‌ పోలిక్‌ ఏసిడ్‌, మల్టీ విటమిన్లు అందించాలని సూచించారు. ఇతర వ్యాధులతో భాద పడుతున్న వారిని గుర్తించి తగు చికిత్సలు అందించాలని ఆదేశించారు. గర్భవతులను ముందుగానే గుర్తించి నమోదు చేయడంతో వారిని ట్రాక్‌ చేయడానికి వీలవుతుందన్నారు. ఈ సందర్భంగా ఆర్‌సిహెచ్‌ నమోదు ముందుగా చేయాలని పలువురు సిడిపిఓలు కలక్టర్‌ దృష్టికి తీసుకురాగా అందుకు సంబంధించి ఆరోగ్య శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ప్రతి సూపర్వైజర్‌ నెలలో కనీసం పది నుండి 15 గ్రామాలలో పర్యటించాలని, అంగన్వాడి కార్యకర్తలకు రక్త హీనత, గర్భిణీ, బాలింతల నమోదు పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. మండలాల వారీగా నలుగురు కన్నా ఎక్కువ మంది పిల్లలను కన్న వారి వివరాలు సేకరించి వారికి, ఆయా గ్రామాల సర్పంచులు, వైద్యాధికారులు, తహసిల్దార్‌, ఎంపిడిఓల ద్వారా కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పి.సూర్యలక్ష్మి, సిడిపిఓలు, సూపెర్వైజర్లు, కార్యాలయ పర్యవేక్షకులు మూర్తి తదితరులు పాల్గొన్నారు.