Oct 07,2022 23:42

ఉత్సవాల్లో పాల్గొన్న కళాకారులు

ప్రజాశక్తి-చింతూరు
చత్తీస్‌ఘడ్‌, సుకమా జిల్లా, కుంట పట్టణంలో 500 సంవత్సరాల నాటి మాణికేశ్వర దేవాలయంలో 66వ శరన్నవరాత్రి మహోత్సవాలు వేలాది మంది భక్తుల కోలాహలం మధ్య గురువారం అర్ధరాత్రి వైభవంగా ముగిశాయి. శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్‌ 26న అమ్మవారి పారాయణం, కలశ స్థాపన, అమ్మవారి ప్రతిష్టతో ప్రారంభమయ్యాయి. అక్టోబర్‌ 6న సాయంత్రం 4 గంటలకు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటలకు రావణ దహనంతో ఉత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాలకు చత్తీస్‌ఘడ్‌, ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మూడు రాష్ట్రాల నుండి నృత్య కళాకారులు వచ్చి తమ సంప్రదాయ రీతిలో భక్తి పాటలకు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. కోలాటం, థింసా నృత్యం, సంబల్‌ పురి డాన్స్‌, భరతనాట్యం, బతుకమ్మ బృందాలు చేసే నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.