Sep 10,2022 23:05

గాజువాకలోని భారీ వినాయక విగ్రహం

దర్శనాలపై పోలీసుల ఆంక్షలు
తక్షణమే నిమజ్జనం చేయాలని ఆదేశం
అభ్యంతరం వ్యక్తం చేసిన ఉత్సవ కమిటీ
ప్రజాశక్తి -గాజువాక
: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన గాజువాక లంకా మైదానంలో నెలకొల్పిన భారీ గణనాధుని విగ్రహం రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎడమ వైపున కొద్దిగా కుంగిపోయింది. పూర్తిగా మట్టితో, ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ విగ్రహం కాస్త కుంగిపోవడంతో సమాచారమందిన వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వెంటనే దర్శనాలను నిలిపేశారు. నిర్వాహక కమిటీతో మాట్లాడిన పోలీసులు, తక్షణమే నిమజ్జనం చేయాలని సూచించారు. అయితే ఉత్సవ కమిటీ నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో, విగ్రహం పరిస్థితిని పరిశీలించేందుకు ఆర్‌అండ్‌బి అధికారులను సంప్రదించగా, వారు వచ్చిన పరిశీలించి, ఏ సమయంలోనైనా భారీ విగ్రహం కూలిపోయే ప్రమాదం ఉందని పోలీసులకు నివేదిక సమర్పించారు. విషయం గాజువాక డిసిపి నాగన్న కూడా వచ్చి విగ్రహాన్ని సందర్శించి, పరిస్థితిని పరిశీలించారు. ఆర్‌అండ్‌బి అధికారుల నివేదిక ఆధారంగా తక్షణమే నిమజ్జనం చేపట్టాలని ఉత్సవ కమిటీని ఆదేశించగా, వారు అంగీకరించకపోవడంతో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నెల 18న ఉన్నచోటనే నిమజ్జనం చేయాలని నిర్ణయించిన ఉత్సవ కమిటీ, అంతవరకు ఉంచేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులు, అధికారులను కోరినా, వారు ససేమిరా అనడంతో కనీసం సోమవారం వరకైనా అవకాశమివ్వాలని కోరారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదించి, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.