కుంగిపోతున్న గోరుకల్లు ఆనకట్ట
- మరమ్మతులు చేపట్టాలి : ఎపి రైతు సంఘం డిమాండ్
ప్రజాశక్తి - నంద్యాల
కుంగిపోతున్న గోరుకల్లు రిజర్వాయర్ ఆనకట్టకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు టి.రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాలలోని రైతు సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోరుకల్ రిజర్వాయర్ ఆనకట్ట గత నెల రోజుల క్రితం నుండి రెండు చోట్ల సుమారు 120 మీటర్లు పొడవునా భూమి అడుగు భాగానికి కుంగిపోతుందని తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్లో కేవలం మూడు టిఎంసిల నీళ్లు ఉండడం వల్ల కట్ట కుంగిన కూడా ఎక్కువ ప్రమాదం కనబడడం లేదని, కానీ వ్యవసాయ సీజన్ ప్రారంభమై వర్షాలు తీవ్రంగా పడి ప్రాజెక్టులకు నీళ్లు రావడం ప్రారంభమైతే కుంగిన కట్ట వల్ల నీరు స్టాక్ పెట్టుకునే దానికి అవకాశం ఉండదని అన్నారు. ఫలితంగా నంద్యాల జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలోని రైతాంగానికి సాగు, తాగునీరు కొరత ఏర్పడుతుందని తెలిపారు. కట్ట కుంగడం వల్ల గోరుకలు ప్రజలు తీవ్ర భయాందోళనలతో నివసిస్తున్నారని చెప్పారు. ఇరిగేషన్ అధికారులకు స్థానిక ప్రజలు తెలియజేసినా ఎలాంటి చర్య తీసుకోలేదని అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే మరమ్మతు చర్యలు పూర్తి చేస్తామని ఇరిగేషన్ ఎస్‌ఇ ప్రకటించి చాలా రోజులు గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభం కాలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నిధుల కేటాయింపు జరగనందువల్లనే మరమ్మతు పనులు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదని అన్నారు. కావున ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన కట్ట మరమ్మతు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రైతులను సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి.రామ చంద్రుడు, పాణ్యం మండల నాయకులు కె.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.










