ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గుంటూరులో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటలవరకు కుండపోతగా భారీ వర్షం కురిసింది. వర్షానికి గుంటూరు కార్పొరేషన్ కార్యాలయంలోకి భారీ వర్షం నీరు చేరింది. డొంకరోడ్డు, అమరావతి రోడ్డు, లక్ష్మీపురం, పట్టాభిపురం, పాత గుంటూరు, నందివెలుగురోడ్డు, పలకలూరు రోడ్డు, పొన్నూరు రోడ్డులో వర్షం నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల, పెదకూరపాడు, సత్తెనపల్లి, అమరావతి, గుంటూరు జిల్లా తాడికొండ, మంగళగిరి, తాడేపల్లి, పెదకాకాని, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈనెలలో చాలినంత వర్షాలులేక సేద్యానికి ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ వర్షం కొంతమేలు చేకూరుస్తుందని భావిస్తున్నారు. కొన్ని రోజులుగా వర్షాలు లేక ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు చల్లటి గాలులతో కొంత వరకు తెప్పరిల్లారు. చల్లటి గాలితో ఆహ్లాదకరమైన వాతావరణ ఏర్పడింది. పెదకూరపాడులో వాన పైర్లకు జీవం పోస్తుందని రైతులంటున్నారు. అయితే గాలుల కారణంగా మొక్కలు వంగుతాయని ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు పెదకూరపాడులోని వాగులు పొంగి రోడ్ల పైనుండి నీరు ప్రవహించింది. పలుచోట్ల బ్రిడ్జిలకు కంప, ఇతర వ్యర్థాలు అడ్డుపడ్డాయి. నీటి ప్రవాహంతో పొలాలు, మట్టి రోడ్లు కోతకు గురవుతాయని స్థానికులంటున్నారు.










