Nov 21,2023 00:36

- వాటర్ బర్డ్స్ లో కట్టడాలు ఎలా చేస్తారు?
- ప్రోక్లైన్ పెట్టి సాయంత్రంలోగా కూల్చేయండి
- డ్రైనేజీ అధికారులకు డిఆర్ఓ ఆదేశం
- కట్టడాలు కూల్చకపోతే సస్పెండ్ అవుతారని హెచ్చరిక 
ప్రజాశక్తి - చీరాల
పట్టణానికి ఆనుకుని ఉన్న కుందేరు మురుగునీటి డ్రైనేజీ స్థలాన్ని ఆక్రమించి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కట్టడాలు నిర్మించడం ద్వారా భవిష్యత్తులో వరద ప్రమాదాలు వచ్చే అవకాశం ఉందని, అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను తొలగించాలని, కుందేరును ఆధునీకరించి నీటిపారుదల సౌకర్యం కల్పించాలని కోరుతూ మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, ఇతర ప్రజా సంఘాల నాయకులు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. నీటి వనరుల అవసరాలను తీర్చాల్సిన డ్రైనేజీ శాఖకు చెందిన స్థలంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని, ఈ విషయాన్ని గతంలో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు వివరించారు. నిర్మాణాలు జరుగుతున్న స్థలం, నిర్మాణానికి కేటాయించిన నిధులు, జల వనరుల అవసరాలకు సంబంధించిన స్థలాన్ని ఖాళీ చేయాలని గతంలో కలెక్టర్ సూచించారని వివరించారు. అయినప్పటికీ నిర్మాణాలు కొనసాగుతున్నాయని వెంటనే ఆపకపోతే నిధులు దుర్వినియోగమవుతాయని చెప్పారు. కుందేరు ఆక్రమణ విషయం కోర్టులో కూడా ఉన్నట్లు చెప్పారు. సమస్య విన్న డిఆర్ఓ పీవి రమణ డ్రైనేజీ, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లను పిలిచి వివరాలు అడిగారు. నీటిపారుదల అవసరాలకు కేటాయించిన స్థలంలో జరుగుతున్న నిర్మాణాలను ఈరోజు సాయంత్రం లోపు ప్రోక్లైన్ ద్వారా కూల్చివేయాలని, ఆ నివేదికను తనకు అందజేయాలని డ్రైనేజీ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను ఆదేశించారు. అలా చేయకపోతే సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. స్పందన కార్యక్రమంలో వినతి పత్రం ఇచ్చిన వారిలో ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి ఏసురత్నం, జనసేన నాయకులు గూడూరు శివరామ ప్రసాద్, చేనేత ఐక్యవేదిక సంఘం నాయకులు శీలం వెంకటేశ్వర్లు ఉన్నారు.