ప్రజాశక్తి-చీరాల: కుందేరు ప్రాంతం అంతా రోజురోజుకూ ఆక్రమణకు గురై అక్రమ నిర్మాణాల కట్టడాల్లో కుచించుకు పోతోందని, భవిష్య త్తులో వరద ముంపు ఎదురైతే నీటి పారుదల లేక చీరాల ప్రాంతం మునిగి పోవడం ఖాయమని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని అన్నారు. కుందేరు డ్రైనేజీ పారుదల లేక చెత్త ఇతర వ్యర్థాలతో, పిచ్చి మొక్కలతో ఎక్కడ నీరు అక్కడ నిల్వ ఉంటూ దుర్వాసన వెదజల్లుతోందని, అధికారులు తక్షణమే కుందేరును ఆధునీకరణ చేయడంతో పాటు మురుగునీరు పారుదలకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో పేరాలలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ జిలాని మాట్లాడుతూ చీరాల ప్రాంతంలోని మురుగునీరు అంతా కుందేరులోకి వచ్చి సముద్రంలోకి చేరుతోందని అన్నారు. అయితే కుందేరు అంతా ఆక్రమణలకు గు గురౌతోందని, ఈ విధంగా ఆక్రమించుకుంటూపోతే రాబోయే రోజుల్లో చీరాల పట్టణం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఇటీవల కురిసిన వర్షానికి చీరాల మసీదు, చర్చ్ ప్రాంతంలో మోకాలి లోతు నీళ్లు రోడ్డుపై నిలిచాయన్నారు. డ్రైనేజీ వ్యవస్థ కూడా సక్రమంగా లేకపోవడం ప్రధాన కారణంగా ఉందన్నారు. మురుగునీరు సముద్రంలో కలిసే అవకాశం లేదని, ఇప్పటికైనా అధికారులు కుందేరు విస్తీర్ణాన్ని పరిశీలించి డ్రైనేజీ పారుదల సక్రమంగా జరిగేలా ఆక్రమణలు అడ్డుకుని సమస్యను వెంటనే పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ బాపట్ల జిల్లా నాయకులు పలువురు పాల్గొన్నారు.










