Jul 12,2023 00:39
మాట్లాడుతున్న సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి ఎన్‌ బాబురావు

ప్రజాశక్తి-చీరాల: కుందేరు ఆధునీకరణ, ప్రజా ప్రయోజనాలు కాపాడటంపై ప్రధాన రాజకీయ పార్టీలు తమ వైఖరిని ప్రకటించాలని సిపిఎం ఆధ్వర్యంలో అంబేద్కర్‌ భవన్లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. దశాబ్దాలుగా కుందేరు ఆధునీకరణ గురించి మాట్లాడుతున్న ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు దురాక్రమణకు గురవుతున్న కుందేరు పట్ల నిర్లిప్తత ధోరణి ప్రదర్శిస్తున్నారని అన్నారు. కుందేరు పరిరక్షణ- ప్రజా ప్రయోజనాలు అనే అంశంపై మంగళవారం ఉదయం స్థానిక అంబేడ్కర్‌ భవనంలో సీపీఎం ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కుందేరులో ఆక్రమణలు రోజురోజుకూ పెరిగిపోతున్నా, ఆక్రమణదారులు వెంచర్లు వేసి అమ్ముకొం టున్నా, అనధికార కట్టడాలు యథేచ్ఛగా జరుతున్నా నివారించాల్సిన అధికారులు ఆక్రమణదారులకు చట్టబద్ధత కల్పించే తరహాలో ప్రభుత్వమే పార్కుల నిర్మాణం పేరుతో కుందేరు భూముల్లో కట్టడాలు నిర్మాణంచేయడం చట్ట విరోధమని అన్నారు. కుందేరు నీటిపారుదలకు అనుగు ణంగా అభివృద్ధి చేసి, కుందేరుపై నీటిపారుదల ఉన్నంత వెడల్పున వంతెనలు నిర్మాణం చేయాలని డిమాండ్‌ చేశారు. నీటిపారుదలకు అనువైన కుందేరు భూముల్లో సుప్రీంకోర్టు తీర్మానం నిర్ణయం ప్రకారం ఎలాంటి కట్టడాలు చేయకూడ దని ప్రతిపాదనను చర్చకు తెచ్చారు. ఈపాటికి జరిగిన ఆక్రమణలను తొలగించాలని, కుందేరు నీటిపారుదలకు పోను మిగిలిన భూములను తేల్చి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. చీరాల నుంచి చిన్నగంజాం వరకు కుందేరు ఆక్రమణల్లో ఉన్న కుందేరు భూములను తేల్చి సాగుకు అనువైన భూములను పేదలకు పంచాలని కోరారు. సమావేశానికి సిపిఎం పట్టణ కార్యదర్శి నలతోటి బాబురావు అధ్యక్షత వహించారు. సమావేశంలో ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి ఏసురత్నం, చేనేత జన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచర్ల మోహనరావు, సీపీఎం నాయకులు కొండయ్య, కేవీపీఎస్‌ అధ్యక్షులు లింగం జయరాజు, టిడిపి పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, బీఎస్పీ నాయకులు గొర్రిపాటి రవికుమార్‌, సమాచార హక్కు చట్టం కార్యకర్త దాసరి ఇమ్మానియేల్‌, ఎరుకుల హక్కుల పోరాట సంఘం నాయకులు ఎన్‌ మోహన్‌ కుమార్‌ ధర్మా, అంబేద్కర్‌ ఉద్యోగుల సంఘం నాయకులు చిరంజీవి, దళిత నాయకులు కంచర్ల చిట్టిబాబు, జనసేన నాయకులు గూడూరు శివరాం ప్రసాద్‌, బీసీ ఫెడరేషన్‌ నాయకులు ఊటుకూరు వెంకటేశ్వర్లు, చేనేత ఐక్యవేదిక సంఘం నాయకులు శీలం వెంకటేశ్వర్లు, ఐఎల్టిడి ఫెడరేషన్‌ నాయకులు గోసాల సుధాకర్‌, నూకతోటి బాబురావు, కోటి ఇమ్మానియేలు, కాంగ్రెస్‌ నాయకులు పుష్పరాజ్‌, శీలం రవి పాల్గొన్నారు. దుద్దు విజరు సుందర్‌, ఎస్‌టీ సెల్‌ నాయకులు శ్రీకాంత్‌, కోటా వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.