Aug 05,2023 22:06

ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు

ప్రజాశక్తి -వీరఘట్టం : మండలంలోని కత్తులకవిటి సచివాలయం పరిధి కుంబులి ఇచ్చాపురం గిరిజన గ్రామంలో జ్వరాలు తీవ్రం కావడంతో వైద్యం కోసం మండల కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రులు రోగులతో కిటకిట లాడుతున్నాయి. బిడ్డక వేణు, పాలక రాఘవ, విశ్వనాధం, ఆరిక భాను ప్రసాదు, బిడ్డక ధనలక్ష్మి తదితరులు జ్వరాల బారినపడి నలిగిపోతున్నారు. మరి కొంతమంది పాలకొండ, శ్రీకాకుళం పట్టణ ప్రాంతాలకు పరుగులు తీసి జ్వరాలను తగ్గించుకునేందుకు ఆరాటం పడుతున్నప్పటికీ జ్వరాలు అదుపులోకి రావడంలేదని గిరి పుత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన పిల్లలు ఆస్పత్రి పాలుకావడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ జ్వరాలు అదుపులోకి రావట్లేదని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలే కాకా ఇంటికి ఒకరు లేదా రెండు మంచాలు చొప్పున జ్వరాలతో మంచాన పడి ఉన్నారు. వారం రోజులుగా జ్వరాలతో బాధపడుతూ మంచం పట్టినప్పటికీ ప్రభుత్వం వైద్యం కరువైందని గిరిజనులు వాపోతున్నారు.