
భోగాపురం: ఆ దంపతులకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. అందులో పనికోసం ఇంటి నుంచి వెళ్లిన ఒక కుమారుడి ఆచూకి పది నెలలుగా కానరాలేదు. దీంతో తల్లడిల్లిన తండ్రి కుమారుడ్ని వెతుక్కుంటూ జార్ఖండ్ రాష్ట్రం నుంచి ఏకంగా వెయ్యి కిలోమీటర్లు దూరంలో ఉన్న మండలంలోని పోలిపల్లి గ్రామం వచ్చాడు. అయినా ఆచూకీ దొరకలేదు కదా పనిచేసిన యజమాని కూడా సహకరించలేదు. దీంతో ఏం చేయాలో తెలియక గత నాలుగు రోజులు ఇక్కడ వెతికాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఏమైనా ఆచూకి లభిస్తుందని స్థానికులు చెప్పడంతో చివరకు భోగాపురం పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపాడు ఆ తండ్రి.
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఎమ్.డి గఫూర్, జరీనా దంపతులకు ఆరుగురు సంతానం. ఇందులో నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు అబ్బాయిలు. ఇందులో రెండో కుమారుడైన ఫైదాన్ అన్సారీ(18)ని మండలంలోని పోలిపల్లి వద్ద మూసేసిన పెట్రోల్ బంకు సమీపంలో టైర్లు పంచర్లు దుకాణం నిర్వహిస్తున్న బీహార్‌కు చెందిన ఖుర్షిద్ అన్సారీ వద్ద వేరే వ్యక్తి ద్వారా గత ఏడాది అక్టోబర్‌లో పనికి కుదిరాడు. నెలకు 3వేలు జీతంతో పాటు వసతి కల్పించేందుకు ఒప్పందం కుదిరింది. మూడు నెలలు తరువాత ఫైదాన్ అన్సారి తండ్రి ఈ ఏడాది జనవరిలో పోలిపల్లి వచ్చినప్పటికి కుమారుడు కనిపించ లేదు. ఎక్కడని ప్రశ్నించగా సాలూరులో తన కుమారుడు రాజా నిర్వహిస్తున్న దుకాణంలో పని చేస్తున్నాడని యజమాని చెప్పి చివరకు కలవనీయకుండా చేయడంతో వెనుదిరిగి వెళ్లిపోయాడు. ఈ ఏడాది జూలైలో అన్సారీ తల్లికి టైర్లు దుకాణం యజమాని ఫోనుచేసి మీ కుమారుడు కనబడడం లేదని ఎక్కడికో వెళ్లిపోయాడని చెప్పాడు. దీంతో తల్లడిల్లిన తండ్రి అక్కడ నుంచి పోలిపల్లి వచ్చి ఈ ప్రాంతంలో వెతకాడు. ఆచూకీ లేకపోవడంతో చివరకు శనివారం భోగాపురం వచ్చి స్థానిక పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు చెప్పాడు.