Dec 19,2021 12:29

నా పుట్టుకనే అసహ్యించుకుంటున్నప్పుడు
నేను అమ్మ గర్భంలోనే ఉన్నాను
నేను ఇదే కులంలో పుడతాను అని
నాకు తెలీదు

నేను పుట్టెసరికి
నా బొడ్డు పేగు తెంపకముందే
నాకు కులం అంటగట్టారు
నాకు తెలీదు
నేను ఇదే కులంలో పుడతాను అని

నేను పాకటం నేర్చెసరికి
నా పాకల మధ్య ఎడబాటు చూసాను
నేను సందు తిరిగితే చాలు
నేను పలానా కులమని
నా చెవులు గుండెలు చిల్లులు పడేలా చెప్పెవాళ్లు
నాకు తెలీదు
నేను ఇదే కులంలో పుడతాను అని

నేను బడికి పోగానే
మీ వాళ్ల పక్కన కూర్చో అనగానే
నేను బిడియంగా
నా వాడ చివర మల్లే
నా వాళ్లే కనిపించే వాళ్లు
నాకు తెలీదు
నేను ఇదే కులంలో పుడతాను అని

నేను కొట్టుకు పోగానే
కీసురు గొంతుతే
ఏం కావాలిరా అని అరిసే సేటు
నా చేతిలో విసరే చూపులుకు
నాకు తెలీదు
నేను ఇదే కులంలో పుడతాను అని

పుట్టిన దగ్గర నుండి అవమానాలు
పడుతున్నవాడినీ
బతుకేందుకు పదేపదే
తన్నకలాడుతున్న వాడినీ
నేను అమ్మ గర్భంలోనే ఉంటే ఎంత బాగుండూ
అని అనిపిస్తోంది

కానీ
నా పుట్టుక
నా ప్రమేయం లేకుండా జరిగింది
ఇప్పుడు
నాకు తెలుసు
నేను కులం అనే కంపులో పుట్టినవాడిని
ఇక్కడ పుట్టడమంటే
కులమనే కంపులో పుట్టడమే
ఇప్పుడు
ప్రపంచానికి పాకుతున్న తాకుతున్న
అతి పెద్ద వైరస్‌ కులం
కరోనాకన్న అత్యంత భయంకరమైనది కులం.
 

తంగిరాల. సోని
9676609234