Feb 16,2023 16:49

కూలిన కల్వర్టు
కూలిన కల్వర్టు గుంతలో వేసిన రాళ్లు
కూలిన కల్వర్టు గుంతలో వేసిన రాళ్లు

కూలిన కల్వర్టు..
పార్వేట ఉత్సవ పల్లకి సాగేదెలా...
ప్రజాశక్తి -రుద్రవరం

      రుద్రవరం మండలంలోని తిప్పారెడ్డి పల్లె గ్రామానికి సమీపంలో ఉన్న లింగమయ్య స్వామి గుడి వద్ద నుంచి పంట పొలాలకు వెళ్లే దారిలో ఉన్న కల్వర్టు దినదినానికి కూలిపోతోంది. చిలకలూరి గ్రామం నుండి తిప్పారెడ్డి పల్లెకు అహౌబిల లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవ మూర్తుల పారువేట పల్లకిని ఈ దారి వెంట బోయలు మోసుకుంటూ రాత్రి సమయంలో వస్తారు. ఒకవైపు రాత్రి సమయం, మరోవైపు కూలిన కల్వర్టు మధ్యలో బోయలు పల్లకిని మోసుకొస్తున్న సమయంలో ఏ ప్రమాదం వాటిల్లుతుందోనని అటు గ్రామస్తులు, ఇటు బోయలు ఆందోళన చెందుతున్నారు. ఈ దారి నుంచి పంట పొలాలకు వెళ్లే రైతులు, తాత్కాలికంగా కూలిన కల్వర్టు గుంతలో రాయి, రప్పలు వేసుకున్నారు. దీంతో కల్వర్టు కింది ప్రాంతంలో ఉన్న పంట పొలాలకు నీటిపారుదల తగ్గుతోంది. అటు వ్యవసాయ రైతులను, బాటసారులు పడే అవస్థలను గుర్తించి ఏ ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.