2022 వరదలకు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో కుప్పకూలిన వేలాది ఇళ్లు
ఏడాది గడిచినా ఇంకా 1280 ఇళ్లకు అందని పరిహారం
ఎన్యూమరేషన్ ప్రక్రియ సరిగా చేయలేదని తీవ్ర విమర్శలు
మళ్లీ వరదకు గ్రామాలొదిలి పునరావాస కేంద్రాలకు తరలిన బాధితులు
ప్రభుత్వ తీరుపై వరద బాధితుల్లో
తీవ్ర ఆగ్రహం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
పోలవరం నిర్వాసితుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా మారింది. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం వరద పరిహారం అందజేతలోనూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 2022 వరదకు దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించిన నష్టపరిహారం ఏడాది గడిచిన ఇప్పటికీ అందించలేదు. ఇప్పుడు మళ్లీ విరుచుకుపడిన వరదలకు అప్పట్లో ఇళ్లు కూలిపోయిన బాధితులే పునరావాస కేంద్రంలో కాలం వెళ్లదీస్తున్నారు. 2022 వరదకు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు అల్లాడిపోయారు. రెండు మండలాల్లో 107 నివాసిత ప్రాంతాలుండగా వరదలకు 95 నివాసిత ప్రాంతాలు ముంపుబారిన పడ్డాయి. దాదాపు 20 వేల కుటుంబాలకు చెందిన ప్రజలు వరద బాధితులుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు, కొండలు.. గుట్టలపైకి చేరారు. దాదాపు నెల నుంచి మూడు నెలలపాటు పునరావాస కేంద్రాల్లోనూ తలదాచుకున్నారు. పెద్దఎత్తున విరుచుకుపడిన వరదకు రెండు మండలాల్లోనూ వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. దెబ్బతిన్న ఇళ్లను కేటగిరీలుగా విభజించి ఎన్యూమరేషన్ చేశారు. దెబ్బతిన్న చాలా ఇళ్లను జాబితాలో చేర్చలేదని అప్పట్లో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. దీంతో రెండోసారి ఎన్యూమరేషన్ చేసినప్పటికీ అర్హులకు న్యాయం జరగని పరిస్థితి నెలకొంది. దెబ్బతిన్న గుడిసెకు రూ.పది వేలు, పూర్తిగా దెబ్బతిన్న కచ్చా, పక్కా ఇంటికి రూ.95,100, పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి రూ.3,200, పాక్షికంగా దెబ్బతిన్న పక్కా ఇంటికి రూ.5,200 చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం నిర్ణయించింది. ప్రభుత్వం లెక్క తేల్చినా జాబితాలో ఉన్న 1,280 దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించిన పరిహారం ఇప్పటికీ అందలేదు. ఇంకా జాబితాలో చోటు దక్కని వారు పెద్దసంఖ్యలో ఉన్నారు. గతేడాది పరిహారం అందకుండానే ప్రస్తుతం మళ్లీ వరద పోటెత్తడంతో అప్పట్లో నష్టపోయిన బాధితులే పునరావాస కేంద్రాల్లోకి తరలొచ్చారు. దెబ్బతిన్న ఇళ్లు పున:నిర్మించుకోవడానికి ఒక్కో కుటుంబానికి అప్పట్లో దాదాపు రూ.50 వేలు వరకూ ఖర్చయింది. ప్రభుత్వం నుంచి మాత్రం రూపాయి సాయం కూడా అందలేదు. ఇచ్చిన పరిహారం లెక్కలు చెబుతున్నారే తప్ప.. ఇంకా లబ్ధిదారులకు చేరని పరిహారం గురించి అధికారులు మాట్లాడని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మళ్లీ వరదకు చాలా ఇళ్లు దెబ్బతిన్న పరిస్థితి ఉంది. గతేడాది దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించిన పరిహారం వెంటనే బాధితులకు అందించడంతోపాటు ఈ ఏడాది దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ నిష్పక్షపాతంగా చేయించాలని అంతా కోరుతున్నారు.
దెబ్బతిన్న ఇళ్ల పరిహారం ఇప్పటికీ అందలేదు..
వేల్పూరు సుజాత, మార్కెట్ సెంటర్, వేలేరుపాడు మండలం
గతేడాది వరదలకు ఇల్లు కూలిపోయింది. శివకాశీపురంలోని ఆశ్రమ బాలిక పాఠశాలలోని పునరావాస కేంద్రంలో మూడు నెలలు ఉండిపోయాం. ఇల్లు మళ్లీ నిర్మించుకోవడానికి రూ.50 వేలు ఖర్చయ్యింది. ప్రభుత్వం నుంచి రూపాయి సాయం అందలేదు. మళ్లీ వరద పోటెత్తడంతో పునరావాస కేంద్రంలోనే ఉంటున్నాం. దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించిన పరిహారం వెంటనే అందించాలని కోరుతున్నాం.
దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం లేదు.. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వరు..
నగిరిగంటి నాగమణి, వేలేరుపాడు మండలం
2022 వరదలకు ఇల్లు పడిపోయింది. నష్టపరిహారం ఇప్పటికీ అందలేదు. నెలలు తరబడి పునరావాస కేంద్రంలోనే ఉన్నాం. మళ్లీ వరదలు రావడంతో పునరావాస కేంద్రానికి చేరాం. దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం ఇవ్వడం లేదు. మరోపక్క ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వరు. ఈ బాధలు పడలేకపోతున్నాం. మాకు న్యాయం చేయాలి.










