May 16,2023 22:35

ప్రజాశక్తి - ముదినేపల్లి
            మండలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణతాపం ప్రజలకు తీరని దాహార్తిని పెంచుతోంది. చల్లని నీటి కోసం జనం మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను ఆశ్రయిస్తున్నారు. ఒకప్పుడు వేసవికాలంలో ప్రజలు మట్టి కుండలోని నీటిని తాగేవారు. కాలక్రమేణా ఫ్రిజ్‌ వినియోగం పెరిగింది. కుండలు పేదవాడి ఫ్రిజ్‌గా మారాయి. అర్థిక స్థోమత ఉన్నవారు నేడు కూలింగ్‌ టిన్నులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పట్టణం, పల్లెల్లో ప్రజలు తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. గ్రామాల్లో కుళాయిల ద్వారా నీరు సక్రమంగా రావడంలేదు. కొన్ని గ్రామాల్లో ఒకపూట మాత్రమే నీటిని కుళాయిలు ద్వారా అందిస్తున్నారు. నీటి కొరతతో ప్రతిఒక్కరూ కూలింగ్‌ టిన్నులను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో చినషాపుల నుంచి హోటళ్ల వరకు, అలాగే చలివేంద్రాల్లోనూ కూలింగ్‌ టిన్నులనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. చాలాచోట్ల మట్టి కుండలు స్థానాన్ని కూలింగ్‌ టిన్నులు భర్తీ చేస్తున్నాయి. వేసవి నేపథ్యంలో అన్నసమారాధన వద్ద, ఏ శుభకార్యలైనా, బజారులో ఏ షాపులో చూసినా, హోటళ్లలో, తాపీ పనులు జరిగే చోట, చలివేంద్రాల్లో ఎక్కడ చూసిన కూలింగ్‌ టిన్నులు దర్శనమిస్తున్నాయి. వేసవి మూడు నెలలు కూలింగ్‌ టిన్నులు వినియోగించేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. టిన్నులో 12 గంటలు వరకు కూలింగ్‌ తగ్గకపోవడంతో ప్రజలు ఎక్కువగా వీటిని ఇష్టపడుతున్నారు. మండలంలో వాటర్‌ప్లాంట్‌ వద్ద 20 లీటర్ల చల్లటి నీరు రూ.40కి, డోర్‌ డెలివరి అయితే రూ.50కి నిర్వాహకులు అందిస్తున్నారు. మండల వ్యాప్తంగా సూమారు 25 వరకు వాటర్‌ ప్లాంట్స్‌ ఉన్నాయి.