
ప్రజాశక్తి - పెదనందిపాడు రూరల్ : ఆదర్శ కమ్యూనిస్టు అయిన తేళ్ల నారాయణ ఆశయాల సాధనకు కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు అన్నారు. స్థానిక తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో తేళ్ల నారాయణ ప్రధమ వర్ధంతి సభను సిపిఎం మండల కార్యదర్శి డి.రమేష్‌బాబు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. అప్పారావు మాట్లాడుతూ కుల వివక్ష, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా నారాయణ పోరాడారని, శాస్త్రీయ భావాలను అభివృద్ధి కృషి చేశారని చెప్పారు. వ్యవసాయ కార్మికులకు కూలి పెంపుతోపాటు రైతు సమస్యల పరిష్కారానికీ పాటుపడ్డారన్నారు. జీవితాంతం కమ్యూనిస్టు సిద్ధాంతానికి, విలువలకు కట్టుబడి పని చేశారని చెప్పారు. ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసిందని, పారిశ్రామిక రంగాన్ని అభివద్ధి చేయకపోగా జాతీయ సంపద అయిన ఎల్‌ఐసి, జిఐసి, రైల్వే, విమానయానం, పోర్టులు, గనులను, అటవీ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని మండిపడ్డారు. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారని, భిన్నాబిప్రాయం వ్యక్తం చేసిన వారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని తెలిపారు. రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసే కుట్ర జరుగుతోందన్నారు. మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ వెనబడిందని, ప్రపంచ ఆకలి సూచిలో దేశం 111వ స్థానానికి దిగజారిందని తెలిపారు. రాష్ట్రానికి విభజన చట్టంలోని హామీలను విస్మరించి అన్యాయం చేశారని, విశాఖ ఉక్కునూ అమ్మేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. అయినా బిజెపిని రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన ప్రశ్నించడం లేదని, పైగా ఆ పార్టీతో ఆంటకాగుతున్నారని దుయ్యబట్టారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడ్డం ద్వారా తేళ్ల నారాయణకు నివాళులర్పించాలన్నారు. సభలో వివిధ సంఘాల నాయకులు కె.నాగేశ్వరరావు, కె.శ్రీనివాసరావు, కె.హరిబాబు, కె.శివనాగేశ్వరరావు, టి.వినోద మాట్లాడారు. ఎం.వెంకటేశ్వర్లు, డి.శ్రీనివాసరావు, ఎం.రమణ, సిహెచ్.యానాదులు, కె.శ్రీనివాసరావు, బి.శంకరయ్య, కె.చందర్రావు, భువవనేశ్వరి, ఎం.లక్ష్మి, విజయలక్ష్మి, కె.వెంకట సుబ్బారావు, పిఎఎస్ కళాశాల ప్రిన్సిపాల్ జి.వీరరాఘవయ్య పాల్గొన్నారు.