May 18,2023 00:27

బుచ్చయ్యపేటలో ప్యాకెట్లు అందజేస్తున్న ఎంపీడీవో

ప్రజాశక్తి-గొలుగొండ: ఉపాధి కూలీలంతా తగినంత తాగునీరు తీసుకుంటూ వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని ఇన్చార్జ్‌ ఎంపీడీవో బివి సత్యనారాయణ అన్నారు. మండలంలో లింగం దొరపాలెం, కొత్త మల్లంపేట, లింగంపేట తదితర గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఈసి రాధికతో కలిసి ఉపాధి పనులను పరిశీలించి కూలీలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూలీలంతా ఉదయాన్నే పనులు ప్రారంభించి వడగాలులకు దూరంగా ఉండాలన్నారు. జాబ్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధి పనులకు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో లింగంపేట సచివాలయ ఏఎన్‌ఎం ఉమా, ఆశా కార్యకర్తలు అచ్చితల్లి, మంగలక్ష్మి , వీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.
నక్కపల్లి:మండలంలోని ఉపమాక, నక్కపల్లి, న్యాయంపూడి, కాగిత గ్రామాల్లో ఉపాధి పనులను ఎంపీడీవో సీతారామరాజు పరిశీలించారు. మెడికల్‌ సిబ్బంది కూలీలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పని ప్రాంతంలో తాగునీటి సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని పని ప్రాంతంలో తప్పనిసరిగా తాగునీటిని అందుబాటులో ఉంచాలని ఉపాధి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో ఈశ్వరరావు, ఉపాధి సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
.బుచ్చయ్యపేట : మండలంలోని బుచ్చయ్యపేట, నేతావానిపాలెం, దిబ్బిడి, చిన్నప్పన్నపాలెం గ్రామ పంచాయతీల పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో సువర్ణ రాజు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పని ప్రదేశాలల్లో మంచినీటిని బిందులతో తెప్పించి ఏర్పాటు చేయించారు. ఉపాధి కూలీలు ఎండలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలకు ఓఆర్‌ఎస్‌ ద్రావణం పేకెట్స్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో మురళి, ఈసీ సతీష్‌, టిఏ లక్ష్మిరావు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు వరాహమూర్తి, కసవ నాయుడు పాల్గొన్నారు.