May 19,2023 00:35

రేపల్లె ఉపాధి పనులు నిర్వహిస్తున్న కూలీలు

ప్రజాశక్తి రేపల్లె : పని ప్రదేశాల్లో కనీస వసతులు కూడా లేక పోవడంతో ఉపాధి కూలీలు అవస్థలు పడుతున్నారు. మండలంలోని 28 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ చట్టం పనులు చేస్తున్న కూలీలు మండుటెండలో అల్లాడిపోతున్నారు. కూలీలు కాసేపు సేద తీరడానికి టెండ్లు ఏర్పాటు చేయాలి. వేసవి తాపం నుంచి రక్షణ కోసం మజ్జిగ, మంచినీరు అందించాలి. అయితే పని ప్రదేశంలో అవేవి కనిపించడం లేదు.
అందుబాటులోని లేని మెడికల్‌ కిట్లు
కూలీలకు పనిప్రదేశంలో అనారోగ్య సమస్యలు తలెత్తినా, వడదెబ్బ తగిలినా తాత్కాలిక ఉపశమం కోసం అవసరైన మెడికల్‌కిట్లు పని ప్రదేశంలో అందుబాటులో ఉంచాలి. అవి ఎక్కడా కనిపించడం లేదు. వేసవి తీవ్రత పెరుగుతున్నందున అనేక మంది అస్వస్థతకు గురై సొమ్మసిల్లిపడిపోతున్నారు. అయినప్పటికీ పని ప్రాంతాల్లో ప్రథమ చికిత్స కిట్లు కూడా లేవు. ఈ విషయం గురించి ఎపిఒ కె. సుబ్బరాజు వివరణ కోరగా మంచి నీరు తీసుకెళ్లినందుకు రూ.5 చొప్పున చెల్లిస్తున్నట్లు తెలిపారు. నీడనిచ్చేందుకు టార్పాలిన్‌ పట్టలు, మెడికల్‌ కిట్లు, మజ్జిగ మంజూరు ఇంకా కాలేదన్నారు. అద్దంకి : ప్రనిప్రదేశంలో కనీస సౌకర్యాలు లేక ఉపాధి కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పని ప్రదేశంలో తాగునీరు, మజ్జిగ, కొద్దిసేపు విశ్రాంతి తీసుకొచేందుకు తార్బాలిన్‌ పట్టలు తదితర సౌకర్యాలు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో కూలీలు ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలో మొత్తం 10, 518 జాబ్‌ కార్డ్‌ ఉన్నాయి. 18,978 మంది కూలీలు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కూలీలు కోరుతున్నారు. నిజాంపట్నం : పని ప్రదేశంలో కనీస వసతులు కూడా లేక పోవడంతో కూలీలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం తాగునీరు, టెంట్‌ కూడా లేక పోవడంతో కొద్ది సేపు సేదతీరేందుకు కూడా వీలు కావడం లేదు. మండలంలో సుమారు 17 వేలు జాబ్‌ కార్డులు ఉన్నాయి. అందులో ఐదు వేలు మంది మాత్రమే ఉపాధి పనులకు వెళ్తున్నారు. పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించి, రోజు వారీ కూలీ గిట్టుబాటు అయ్యేలా చూడాలని కూలీలు కోరుతున్నారు.