ఉపాధి కూలీల పట్ల ప్రభుత్వ తీరు దారుణం
పే స్లిప్పులు ఇవ్వకుండా మోసపూరిత వైఖరి
బ్యాంకు ఖాతాలో ఎంత పడితే అంతే
జిల్లాలో కొనసాగుతున్న పరిస్థితిపై కూలీల్లో చర్చ
రెండు పూటలా పని విధానంతో వడదెబ్బకు కూలీలు విలవిల
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
ఏదైనా పనికి వెళితే ఎంత కూలిస్తారో ముందే చెబుతారు. దాన్నిబట్టి కూలీలతో పని చేయించుకుంటారు. ఉపాధి హామీ పనుల్లో మాత్రం పని చేయడమే తప్ప రోజుకు కూలి ఎంత వస్తుందో తెలియదు. గతంలో పే స్లిప్పుల ఆధారంగా ఏ రోజు ఎంతపడుతుందో వివరాలు ఇచ్చే ప్రభుత్వం వాటిని ఇవ్వకుండా నిలిపివేసింది. దీంతో ఉపాధి పనిచేస్తున్న కూలీలకు ప్రభుత్వం నిర్ధేశించిన కూలి వస్తుందో లేదో కూడా ఏ ఒక్కరికీ తెలియడం లేదు. అదేమని అడిగితే ఏ అధికారీ కారణం చెప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలను వేతన విషయంలోనూ మోసం చేస్తున్నారు.
ఉపాధి హామీ చట్టం నిర్వీర్యానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుందని స్పష్టమవుతోంది. ఉపాధి కూలీల పట్ల బిజెపి వ్యవహరిస్తున్న తీరే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. రెండు జిల్లాల్లో 5.50 లక్షల మందికిపైగా ఉపాధి హామీ జాబ్‌కార్డులున్నాయి. ప్రతీ కుటుంబానికి వందరోజుల పనిదినాలు కల్పించాలన్న నిబంధన ఉంది. వందరోజుల పనిదినాలు అనేవి అమలుకావడం లేదు. 2022-23లో రెండు జిల్లాల్లో సరాసరిన కుటుంబానికి కల్పించిన పనిదినాలు 50 రోజులు కూడా లేవు. పనిదినాలను సైతం కుదించేస్తున్న ప్రభుత్వం ఉపాధి కూలీల హక్కులను సైతం హరిస్తోంది. ఉపాధి పనిలో రెండు పూటలా పనివిధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఉదయం ఐదు గంటలకు పని ప్రదేశానికి చేరుకుంటున్న కూలీలు మధ్యాహ్నం 11.30 గంటల వరకూ ఉండాల్సి వస్తోంది. మొదటి ఫొటోకు, రెండో ఫొటోకు నాలుగు గంటల వ్యవధి ఉండాలన్న నిబంధనే అందుకు కారణం. ఇన్ని నిబంధనలు తెచ్చిన కేంద్ర ప్రభుత్వం కూలీలకు ప్రతిరోజూ ఎంతకూలి వస్తుందో చెప్పే పే స్లిప్పులు మాత్రం ఇవ్వడం లేదు. గతంలో వారానికి ఒకరోజు ఉపాధి కూలీలకు పే స్లిప్పులు ఇచ్చేవారు. ఏరోజు ఎంత కూలిపడిందో అందులో స్పష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు. అదేమని అడిగితే కూలీల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం కదా ఇంకా పే స్లిప్పులు ఎందుకని మాట్లాడుతున్నారు.
రోజు కూలి ఎంత పడింతో తెలియాలా.. వద్దా
జిల్లాలో చాలా చోట్ల దాదాపు ఐదు వారాల నుంచి ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ రెండు వారాల కూలి సొమ్ములు మాత్రమే వారి ఖాతాల్లో జమయ్యాయి. ఏ రోజు ఎంత కూలి వచ్చిందో ఏ ఒక్కరికీ తెలియడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపాధి కూలీలకు రోజుకు రూ.272 కూలి ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో ఏ ఒక్క ఉపాధి కూలీకి ప్రభుత్వం చెప్పిన కూలి సొమ్ము అందడం లేదు. అనేక కారణాలు చెబుతూ కోతలు పెడుతున్నారు. బ్యాంకులో పడిన సొమ్ముల ప్రకారం సరాసరి లెక్కిస్తే రూ.200 నుంచి రూ.240 వరకూ వస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నిసార్లు రూ.180 కూడా రావడం లేదు. ప్రభుత్వం నిర్ధేశించిన పని చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో కూలి ఎందుకు ఇవ్వడం లేదో చెప్పడం లేదు. ఏ రోజు ఎంత కూలి వచ్చిందో వివరాలు ఇవ్వడం లేదు. దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో తెలియడం లేదు. పే స్లిప్పులు ఇవ్వాలని కూలీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. మండుటెండలో అన్ని గంటలు పనిచేస్తున్నప్పటికీ పూర్తిస్థాయి కూలి పడకపోగా, వచ్చే కూలి ఎంతో కూడా తెలియని అమోమయ పరిస్థితిలో ఉపాధి కూలీలు ఉండటం దారుణంగా చెప్పొచ్చు. పే స్లిప్పులు ఇస్తే రోజు కూలి లెక్కతెలిస్తే ఆ రోజు ఎందుకు తక్కువ కూలి పడిందో కూలీలు అధికారులను అడిగే అవకాశం ఉంటుంది. పే స్లిప్పులు ఇవ్వకపోవడంతో కూలీలు అడిగలేని పరిస్థితి ఏర్పడింది.
పే స్లిప్పులు ఇవ్వడం లేదు
తినార్తి శ్రీను, పాలగూడెం, ఉపాధి కూలీ
పే సిప్పులు ఇవ్వడం లేదు. ఇప్పటి వరకూ ఐదు వారాలు పనిచేశాం. రెండు వారాల డబ్బులు జమయ్యాయి. పే స్లిప్పులు ఇస్తే ఏ రోజు కూలి ఎంతో పడుతుందో తెలుస్తుంది. గతంలో ఇచ్చేవారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదో తెలీడం లేదు.
ఇబ్బంది కరంగా రెండు పూటల పని విధానం
టి.వరలక్ష్మి, పాలగూడెం, ఉపాధి కూలీ
రెండు పూటలా పనివిధానంతో తెల్లవారుజామున వెళితే ఇంటికి వచ్చేసరికి 11 గంటలు దాటేస్తోంది. దీంతో ఎండ దెబ్బ తీవ్రంగా ఉంటుంది. మజ్జిగ ఇవ్వడం లేదు. పే స్లిప్పులు ఇస్తే కూలి వివరాలు తెలుస్తాయి. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. ఏ రోజు ఎంత కూలి పడిందో తెలీదు.










