- ముఠా కార్మికుల నిరవధిక సమ్మె, ప్రదర్శన
ప్రజాశక్తి-వన్‌టౌన్: వన్‌టౌన్, కొత్తపేటలోని వివిధ వ్యాపారాల వద్ద ఎగుమతి, దిగుమతులు చేస్తున్న ముఠా కార్మికులు కులి రేట్లు పెంపుదల చేయాలని కోరుతూ గురువారం నుండి నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సమ్మె ప్రారంభంగా ముఠా కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కార్మిక ప్రదర్శన వన్‌టౌన్ చిట్టూరి కాంప్లెక్స్ వద్ద నుంచి ప్రారంభమై పలు వీధుల గుండా సాగింది. ఈ ప్రదర్శనలో సిఐటియు ఎన్‌టిఆర్ జిల్లా ఉపాధ్యక్షులు డి.వి. కష్ణ, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఎం సాంబశివరావు పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికులు, కార్మిక సంఘాలు ఇప్పటికే అనేకసార్లు కూలీ రేట్లు పెంచమని సంబంధిత వ్యాపార యజమానులను అడిగారని, అయినా యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న ధరల నేపథ్యంలో ముఠా కార్మికుల జీవనం కష్టంతరంగా మారిందన్నారు. ఆదాయం తగ్గి ఖర్చులు పెరుగుతున్న సందర్భంలో కూలి రేట్లు పెంచటం న్యాయమన్నారు. రెండేళ్లకోసారి కూలి రేట్లు పెంపు ఒప్పందం మేరకు, గత కూలి రేట్లు ఒప్పంద కాలం గడిచి మూడు నెలలు అయిందన్నారు. ఇప్పటికైనా కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని యజమానులను కోరారు. ఈ కార్యక్రమంలో ముఠా కార్మిక నాయకులు ఎం.సీతారాములు, వి.నాగేశ్వరరావు, బ్రహ్మయ్య, ఇ.వి. నారాయణ, శ్రీరామమూర్తి, చౌదరి, దాసు, ఆవులయ్య తదితరులు పాల్గొన్నారు.










