ప్రజాశక్తి-అనకాపల్లి
కూలి రేట్లు పెంచాలని కోరుతూ మండలంలోని శంకరం గ్రామం వద్ద ఉన్న జిల్లా ఎక్సైజ్ బేవరేజెస్ డిపోలో పనిచేస్తున్న శుక్రవారం డిపో ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎగుమతులను నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా డిపో హమాలీల యూనియన్ (సిఐటియు) అధ్యక్ష కార్యదర్శులు జీరు కనక రమణ, కరణం కొండలరావు మాట్లాడుతూ పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా మద్యం పెట్టే ఒక్కంటికి ప్రస్తుతం ఇస్తున్న రేటుకు రూ.3 కలిపి రూ.10 చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతవరకు ఎగుమతులను నిలుపుదల చేస్తూ సమ్మె చేపడతామని హెచ్చరించారు. హమాలీలకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్‌ఐ, పెన్షన్ అమలు చేయాలని కోరారు. ఒప్పందం ముగిసినా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెరగకపోవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ధరలు ఈ ఏడాది నవంబర్ 1 నుంచి అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు టి.రాజు, బి శ్రీను, బి సూర్య నాయుడు, సిహెచ్ రాజేష్, ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










