Feb 09,2023 23:53

రోధిస్తున గిరిజన మహిళలు

ప్రజాశక్తి - పెదబయలు :వారంతా గిరి పేదలు.. ఉపాధి కోసం పొట్టచేతపట్టుకుని వేరే జిల్లాకు ఈ మధ్యనే వెళ్లారు. పట్టుమని పది రోజులు గడవక ముందే వారిళ్లలో తీవ్ర విషాదం. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేట గ్రామంలో నిర్వహిస్తున్న అంబటి సుబ్బన్న అండ్‌ కో ఆయిల్‌ కంపెనీకి చెందిన పరిశ్రమలో ఆయిల్‌ ట్యాంకర్‌ క్లీన్‌ చేయడానికి దిగి ఊపిరి ఆడక ఏడుగురు కార్మికులు గురువారం మృతిచెందగా వారిలో అల్లూరి సీతారామరాజు జిల్లా, పెదబయలు మండలానికి చెందిన వారే ఐదుగురు ఉన్నారు. దీంతో వారి స్వస్థలాలైన పర్రెడ, బొండాపల్లి ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో వెచ్చంగి కృష్ణ (35), వెచ్చంగి నరసింహ (38), వెచ్చంగి సాగర్‌(20), కుర్తాడి బొంజుబాబు (26), కొర్ర రామారావు(43) ఉన్నారు. వీరిలో కృష్ణ, నరసింహ, సాగర్‌ ఒకే కుటుంబానికి చెందినవారు.
కూలి పనుల కోసం వెళ్లి..
పర్రెడ పంచాయతీ లక్ష్మీపురం గ్రామం నుంచి వెచ్చంగి కృష్ణారావు, వెచ్చంగి నరసింహ, వెచ్చంగి సాగర్‌ ఇదే పంచాయతీలోని వంచెడిపుట్టు గ్రామ నివాసి కుర్తాడి బొంజుబాబు, బొండాపల్లి పంచాయతీ, ఈదులమెట్ట గ్రామ నివాసి కొర్ర రామారావు కూలి పనుల కోసం పది రోజులు క్రితం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేటకు వెళ్లారు. అక్కడి ఆయిల్‌ కంపెనీలో పనికి కుదిరారు. ఇక ఎంతో కొంత కూలి డబ్బులు వస్తాయని, వాటితో జీవనం సాగించొచ్చని వారి కుటుంబీకులు అనుకున్నారు. ఇంతలోనే పెద్ద కుదుపు. ఫ్యాక్టరీలోని ఐదో నెంబరు ఆయిల్‌ ట్యాంకును శుభ్రం చేసేందుకు దిగి వారు ఊపిరాడక చనిపోయారన్న విషాద వార్త. దీంతో వారివారి స్వస్థలాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబీకులను గిరిజన, ప్రజా సంఘాల నాయకులు పరామర్శించారు.
ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ
మృతుల్లో ఈదులమెట్ట గ్రామస్తుడు కొర్ర రామారావుకు భార్య, ఎనిమిది మంది సంతానం. వెచ్చంగి నరసింహకు భార్య, నలుగురు పిల్లలు, కృష్ణారావుకు భార్య ఐదుగురు సంతానం. వెచ్చంగి సాగర్‌కు ఇంకా వివాహం కాలేదు. మృతుల్లో కృష్ణ, నరసింహ, సాగర్‌ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఆ కుటుంబీకుల రోధనలు మిన్నంటాయి. కృష్ణారావు కుమార్తె పవిత్ర విశాఖపట్నంలో నర్సింగ్‌ కోర్సు చదువుతోంది. ఆమెకు ఫీజు కట్టేందుకు డబ్బులు కూడబెట్టేందుకు కృష్ణారావు కూలి పనులకు వెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మిగతా వారూ ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకే వలసలు వెళ్లారు.
పలువురు పరామర్శ
మృతుల కుటుంబీకులను గిరిజన సంఘం పూర్వ జిల్లా అధ్యక్షులు బొండా సన్నిబాబు, సిఐటియు మండల కార్యదర్శి కె.శరభన్న తదితరులు పరామర్శించారు. గిరిజనులు పండిస్తున్న వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర దక్కక పలువురు వలసలు పోతున్నారని, కొందరు అక్కడే తనువు చాలిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు.