27 నుంచి వారం రోజుల పాటు సర్వే
యాప్‌లో కోరిన వివరాలతో సమగ్రత ఉండదు : ఎంల్‌సి సాబ్జీ
ప్రజాశక్తి - ఏలూరు
ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నిరుపేద కులాల వారికి అందించడమే కుల గణన ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. జిల్లాలో కుల గణన నిర్వహణపై వివిధ సామాజిక తరగతుల ప్రజలకు అవగాహన, సూచనలు స్వీకరణకు శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు హాలులో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పద్మశ్రీ, ఎంఎల్‌సి షేక్ సాబ్జీ, వివిధ శాఖల అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరికీ సామాజిక న్యాయం అందించాలన్నదే కులగణన ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లాలో కులగణన సర్వే ఈనెల 27వ తేదీ నుండి వారం రోజుల పాటు జరుగుతుందని, సంచార జాతులు, వలస కార్మికులు, సర్వే సమయంలో అందుబాటులో లేనివారి వివరాలు సర్వే కోసం మరో వారం రోజులు సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రస్తుత సర్వేలో ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు నమోదు చేస్తారన్నారు. కుల గణన సర్వే గ్రామ/వార్డ్ సచివాలయాలు పరిధిలో జరుగుతుందని, కుటుంబ సభ్యుల విద్య, ఆర్థిక, సామజిక, కులం, ఉపకులం వివరాలు కులగణన ప్రత్యేక యాప్‌లో పొందుపరుస్తారన్నారు. సర్వేలో సచివాలయ కార్యదర్శి, వాలంటీర్లు పాల్గొంటారన్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన కులాన్ని పరిగణనలోకి తీసుకుంటారని, కుల నిర్ధారణ కోసం ఎలాంటి ధృవీకరణ పత్రం అందించాల్సిన అవసరం లేదన్నారు. కుటుంబంలోని సభ్యుల వివరాలు యాప్‌లో నమోదు చేసిన తరువాత 18 సంవత్సరాలు నిండిన సభ్యుల ఇకెవైసితో నిర్ధారించాల్సి ఉంటుందన్నారు. ఈ సర్వేలో సేకరించిన వివరాలతో ఏ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమానికి అనుసంధానించడం జరగదని, పథకాలు తొలగించడం జరగదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు అపోహలు పడొద్దన్నారు. జిల్లాలో 696 కులాలు, ఉపకులాలున్నాయని, వాటిని యాప్‌లో పొందుపరిచామని, వాటిలో లేని కులాలు గానీ, ఉపకులాల గానీ తమ దృష్టికి తీసుకువస్తే వాటిని కూడా యాప్‌లో పొందుపరుస్తామన్నారు. సర్వే విజయవం తానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జెడ్‌పి చైర్‌పర్సన్ పద్మశ్రీ మాట్లా డుతూ దేశంలో కుల గణన 1931లో చేపట్టారని, మళ్ళీ ఎన్నో దశాబ్దాల తరువాత సిఎం జగన్ చొరవతో కులగణన చేపట్టడం చారిత్రాత్మకమైన నిర్ణయమన్నారు.
ఎంఎల్‌సి షేక్ సాబ్జీ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కుల గణనను స్వాగతిస్తున్నామన్నారు. యాప్‌లో కోరిన వివరాలతో సమగ్ర సమాచారం రాదని, వీటిలో మరికొన్ని అంశాలను చేర్చాల్సి ఉందన్నారు. సివిల్ కండక్ట్ రూల్స్ పరిధిలో లేని గ్రామ/వార్డ్ వాలంటీర్లకు సర్వే నిర్వహణను అప్పగించొద్దన్నారు. సర్వే చేపట్టడంతో పాటు కులగణనకు చట్టబద్దత కల్పించాలని, బీహార్‌లో చేసిన కులగణనకు చట్టబద్దత కల్పించి, రిజర్వేషన్లు సవరించారని, అదే విధంగా రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి, కులగణన ప్రాతిపదికన పేదలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కులగణన సర్వేకు వారం రోజుల సమయం సరిపోదని, మరింత పెంచాలని కోరారు. ఈ సమావేశంలో మెండెం సంతోష్‌కుమార్, దేవరకొండ వెంకటేశ్వర్లు, ఎ.శివకేశవరావు, పొలిమేర హరికృష్ణ, చప్పిటి గంగాధరరావు తమ సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో జెసి బి.లావణ్య వేణి, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీపూజ, జిల్లా పరిషత్ సిఇఒ సుబ్బారావు, అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.