Nov 13,2023 22:20

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం కుల గణనపై ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ప్రాంతీయ రౌండు టేబుల్‌ సమావేశం ఈ నెల 17న నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశాన్ని నగరంలోని హోటల్‌ మంజీరాలో నిర్వహి స్తున్నామని, ఈ సమావేశంలో కుల గణనకు సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చేవారు ముందస్తు అనుమతి పొందాలని తెలిపారు. అటువంటి వారు ఈ నెల 15వ తేదీలోగా ఆయా డివిజన్లకు చెందిన ఆర్‌డిఒలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని 5 జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు, జడ్‌పి ఛైర్మన్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, సభ్యులు, ప్రజా ప్రతినిధులు, మేధావి వర్గం, తదితరులతో ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఈ మేరకు సంబంధిత జిల్లా కలెక్టర్లకు లేఖ రాయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సమావేశం ప్రారంభం అవుతుందని కలెక్టర్‌ వెల్లడించారు. కుల గణన ప్రక్రియ విజయవంతం అయ్యేలా తమ విలువైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.