Nov 17,2023 22:59


- కమిషనర్‌ అరుణ
ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: కులగణన ప్రక్రియను నగరపాలక పరిధిలో పక్కాగా చేపట్టాలని కమిషనర్‌ అరుణ అధికారులకు సూచించారు. నగరపాలక సంస్థ, చిత్తూరు రూరల్‌, అర్బన్‌ మండలాల పరిధిలో కుల గణన-2023 నిర్వహణపై మాస్టర్‌ ట్రైనర్లకు శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మాస్టర్‌ ట్రైనర్‌, డిప్యూటీ కలెక్టర్‌ శివయ్య మున్సిపల్‌, మండల స్థాయి మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు. కమిషనర్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో జరిగే కులగణన కార్యక్రమాన్ని ఏలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చేయాలన్నారు. సర్వే నిర్వహణపై అవగాహన పెంచుకొని, వార్డు స్థాయిలో వాలంటీర్లకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు. డిప్యూటీ కలెక్టర్‌ శివయ్య మాట్లాడుతూ కులగణన-2023 సర్వే నిర్వహణపై మాస్టర్‌ ట్రైనర్లు పూర్తిస్థాయి అవగాహన చేసు కోవాలన్నారు. వార్డు స్థాయిలో ఈనెల 21-23వ తేదీల మధ్య వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. కుల గణన యాప్‌ లో నిర్దేశించిన మేరకు తప్పులు లేని వివరాలను నమోదు చేయాలన్నారు. క్షేత్రస్థాయి సర్వే పై పవర్పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రాజ్యలక్ష్మి, తాహసిల్దార్‌ మురళీమోహన్‌, ఎంపీడీవో సుధాకర్‌ రెడ్డి, మాస్టర్‌ ట్రైనర్లు పాల్గొన్నారు.