- వాంబేకాలనీలో ప్రభుత్వ గృహాలను పరిశీలించిన సిపిఎం బృందం
ప్రజాశక్తి-అజిత్‌సింగ్‌నగర్: కూలడానికి సిద్ధంగ ఉన్న ఇళ్లల్లో ప్రజలు ఎలా జీవిస్తారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు ప్రశ్నించారు. గురువారం వాంబే కాలనీ, న్యూరాజరాజేశ్వరిపేట ప్రాంతంలోని ప్రభుత్వ గృహాలను సిపిఎం బృందం సందర్శించింది. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ వాంబేకాలనీలో ఇళ్లు నాసిరకంగా ఉండటంతో స్లాబులు పెచ్చులూడి ఇనుప చువ్వలు బయటపడుతున్నాయన్నారు. స్లాబులు కూలిపోయి పలు సందర్భాల్లో పేదలు గాయపడ్డారని తెలిపారు. ఎప్పుడు ఇళ్లు కూలిపోతాయోననే భయాందోళనతో పేదలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తలుపులు, కిటికీలు దెబ్బతిన్నాయన్నారు. ఇళ్ల మరమ్మతులకు, పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తామన్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇళ్ల నిర్మాణాలకు బ్యాంకులు ఇచ్చిన రుణాలు వడ్డీతో సహా కట్టాలని నోటీసులు ఇస్తున్నారని తెలిపారు. ఇంతవరకు ప్రభుత్వం ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. తక్షణమే దెబ్బతిన్న ఇళ్ల పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయాలని లేకపోతే ప్రభుత్వమే ఇళ్లను పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి.రమణరావు, కె.దుర్గారావు, సిహెచ్.శ్రీనివాస్, ఎస్‌కె పీర్ సాహెబ్, టి.శ్రీనివాస్, డి.రమణ, ఓంకార్,రత్నకుమారి, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.










