మండవల్లిలో క్షీణించిన పారిశుధ్యం
రోడ్లు, వీధులు అధ్వానం
వ్యాధుల భయంతో గ్రామస్తులు ఆందోళన
పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి - మండవల్లి
గ్రామస్తుల కనీస అవసరాలు తీర్చడంలో పంచాయతీ అధికారులు విఫలమవుతున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కుళాయిల ద్వారా దుర్వాసన వెదజల్లే పురుగులతో కూడిన మురుగునీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో వ్యాధులు ప్రబలుతాయని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. తాగునీరు, వాడుకునేందుకు సురక్షిత నీరు లేక నానా అవస్థలు పడుతున్నారు. మండలకేంద్రమైన మండవల్లిలో పారిశుధ్యం పూర్తిగా క్షీణించింది. వీధిలైట్లు డ్రైనేజీని సక్రమంగా నిర్వహిస్తూ రోడ్లు ఏర్పాటు తోపాటు స్వచ్ఛమైన తాగునీటిని పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అందించాల్సి ఉంది. అయితే ఇందులో ఏ ఒక్కటీ సక్రమంగా అమలు కావడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద నుండి బిసి కాలనీ వరకూ ఉన్న వ్యక్తిగత కుళాయిల ద్వారా కొంతమందికి దుర్వాసన వెదజల్లే మురుగునీరు వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 25 రోజులుగా కుళాయిల ద్వారా మురుగునీరు వస్తుందని, తాగడానికి, వాడుకోవడానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నామని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు. అయితే ఖర్చులు తామే భరిస్తామని వేరే పైప్‌లైన్ ద్వారా నిరందించే చర్యలు తీసుకోవాలని బాధితులు కోరినప్పటికీ వేరే పైపులైన్ ద్వారా నిరందించడానికి ఓ వ్యక్తి ఒప్పుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. కొందరు బాధితులు 'మేము మండవల్లి వాసులం కాదా పంచాయతీలో మధ్యవర్తి ప్రమేయం ఏంటి' అంటూ ప్రశ్నిస్తున్నారు. మండవల్లిలో చెత్త ఎక్కడపడితే అక్కడ కుప్పలు కుప్పలుగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. దుర్వాసన వెదజల్లే మురుగునీరు గ్రామాల్లోని వీధుల్లో నిత్యం ప్రవహిస్తూనే ఉంటుందని, పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పంచాయతీ కుళాయిల ద్వారా మురుగునీటిని సరఫరా చేసే పరిస్థితి వచ్చిందని పలువురు విమర్శిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సమస్యలపై దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి తోట శ్రీనివాస్‌ని వివరణ కోరగా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.










