ప్రజాశక్తి - వేపాడ : మండలంలోని సింగరాయి గ్రామంలో జలజీవన్ పథకం కింద ఇంటింటికీ తాగునీరందించాలనే ఉద్దేశ్యంతో రూ.40లక్షలు పెట్టి వీధుల్లో పైప్‌లైన్ వేసి కుళాయి ట్యాప్‌లు ఏర్పాటు చేశారు. కానీ ఎస్‌సి కాలనీలో ట్యాప్‌లు వేసినా వాటి ద్వారా పూర్తి స్థాయిలో తాగునీరు రావడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో 65 కుటుంబాలు ఉన్నాయని ఇంటింటికి పైప్‌లైన్ ఏర్పాటు చేసినప్పటికీ తాగునీటిని మాత్రం అందించడం లేదని చెబుతున్నారు. గతంలో జిల్లా పరిషత్ సిఇఒ మోహన్ రావు రూ.50 వేలతో కాలనీలో పూర్తిగా తాగునీరు అందే సౌకర్యం కల్పించారని ఇప్పుడు జలజీవన్ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరందిస్తామని గతంలో ఇచ్చిన తాగునీటి పైపులను తొలగించారని చెబుతున్నారు. ఇప్పుడు కొత్త పైపుల ద్వారా తాగునీరు రాక, పాత పైపులైన్‌ను తొలగించడం ద్వారా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. పైగా పైపులైన్ ఏర్పాటు చేయడానికి గట్టిగా ఉన్న రోడ్డును కూడా తవ్వేసి నడవడానికి కూడా వీల్లేకుండా చేశారని చెబుతున్నారు. కుళాయిల ద్వారా తాగునీరు రాకపోవడంతో కాలనీలో ఉన్న బోరే తిరిగి వారికి జీవానాధరమైందని కుళాయిల ద్వారా తాగునీటిని అందించాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఆర్‌డబ్ల్యుఎస్ జెఇ దేవిని వివరణ కోరగా కాంట్రాక్టర్‌ను పంపించి కాలనీ వాసులకు తాగునీరు అందే విధంగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఒక బిందె నీరు కూడా రాలేదు
ఇంటింటికి తాగినీటి సరఫరా చేస్తామని కుళాయి వేసి సుమారు నెలరోజులు కావస్తున్న ఒక బిందె నీరు కూడా రాలేదు. గతంలో మా ఇంటి వద్ద పైపు ఉండేది. ఆ పైపు ద్వారా పూర్తిగా నీరు అందేది. ఆ పైపును తీసివేసి ఇంటింటికి తాగునీరు ఇస్తామని కొత్తగా కుళాయిలు వేశారు. నెల రోజులు కావస్తున్న వాటి ద్వారా నీరు మాత్రం అందడం లేదు.
గొల్ల మహేష్, ఎస్‌సి కాలనీ, సింగరాయి