Oct 29,2023 21:34

బిసి ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు వెంకటేశ్వరరావు
ప్రజాశక్తి - పాలకోడేరు
కేంద్ర ప్రభుత్వం వెంటనే కులాల వారీగా జనగణన చేపట్టాలని బిసి ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గూడూరి వెంకటేశ్వరరావు అన్నారు. జాతీయ బిసి ప్రజా సంక్షేమ సంఘం సమావేశాన్ని గొల్లలకోడేరులో మండల అధ్యక్షులు దొమ్మేటి వేణుగోపాలం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కుల గణన విషయంలో కేంద్ర ప్రభుత్వం కుంటి షాకులు చెబుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కులాల వారీగా జన గణన చేపట్టి సంఖ్యాపరంగా ఉన్న బీసీలకు సీట్లను కేటాయించాలన్నారు. వచ్చే ఎన్నికల్లోపే వివరాలు బహిర్గతం చేయాలన్నారు. ప్రస్తుతం బిసిలకు 34 శాతం నుంచి 23 శాతానికి రిజర్వేషన్‌ పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో కచ్చితంగా 34 శాతం రిజర్వేషన్‌ కొనసాగించాలన్నారు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్‌ ప్రకటించడం ద్వారా బిసిలను ముంచినట్లేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బిసి ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చిప్పాడా చంద్రశేఖర్‌, జిల్లా అధ్యక్షులు కుక్కల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కండిబోయిన సుబ్రహ్మణ్యం, మండల అధ్యక్షులు దొమ్మేటి వేణుగోపాలం, ఉపాధ్యక్షులు నేతల గోపి, గౌరవాధ్యక్షులు సత్యనారాయణ పాల్గొన్నారు.