మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో కులాల వారి సమాచారంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ మార్చి 2, 2021న అడ్వయిజరీ ఫైల్‌ను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. ఉపాధి హామీలో దళితులు, గిరిజనుల వివరాలు, వారి పని దినాలను ప్రత్యేకంగా పేర్కొనాలని, ఆ ప్రాతిపదికపై 2021-22 వేతనాల చెల్లింపు ఉంటుందని ఆ అడ్వయిజరీ ఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. 2006లో ఉపాధి హామీని ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఇలాంటి సర్క్యులర్‌లు ఏవీ కేంద్రం నుండి రాష్ట్రాలకు రాలేదు. మొదటి సారిగా కేంద్ర బిజెపి ప్రభుత్వం ఉపాధిలో కులాల విభజన గురించి పైపైన పరిశీలిస్తే హిందూత్వ శక్తుల అసలు ఎజెండా అర్థం కాదు. ఎస్సీ, ఎస్టీలకు ప్రయోజనం కలగజేయడానికే ఈ వివరాల సేకరణ అనే ముసుగేసి ఉపాధి హామీ పథకాన్ని బలహీనపర్చడం, దళిత, గిరిజనులకు తీవ్ర అన్యాయం చేయడమే. అంతిమంగా ఉపాధి హామీ చట్టం యొక్క మౌలిక లక్ష్యాలనే దెబ్బ తీసేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం సిద్ధమైంది.
దేశంలో 714 జిల్లాలలో 7,145 బ్లాకులు, 2,69,434 పంచాయితీల్లో అన్ని గ్రామాలకు విస్తరించిన అతి ముఖ్యమైనది ఉపాధి హామీ చట్టం. 2004లో వామపక్షాల మద్దతు కేంద్ర ప్రభుత్వానికి ఉండడం, వారి ఒత్తిడిపై ఉపాధి హామీ పథకంగా కాకుండా చట్టంగా రూపుదిద్దుకున్నది. ఉపాధి హామీలో ఎలాంటి మౌలికమైన మార్పులు చేయాలన్నా పార్లమెంట్‌కే అధికారం ఉన్నది. అలాంటి ఈ చట్టాన్ని మోడీ ప్రభుత్వం నీరుగార్చడానికి సర్క్యులర్లు, అడ్వయిజరీల పేరుతో దొడ్డిదారిన అనేక మార్పులు చేస్తున్నది. హిందూత్వ శక్తులు ఉపాధి హామీలో తెస్తున్న మార్పులు ఎంత ప్రమాదకరమో అర్థం కావాలంటే చట్టంలో ఉన్న మౌలిక అంశాలను గుర్తుచేసుకోవడం అవసరం. ఉపాధి హామీ చట్టంలో రాజీలేని అంశాలను కొన్నింటిని పేర్కొన్నది. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి వయోజనుడికి కులాలు, మతాలు, ప్రాంతాలతో నిమిత్తం లేకుండా పని అడిగిన వారందరికీ సంవత్సరంలో 100 రోజులకు తక్కువ కాకుండా పని కల్పించాలన్నది వాటిలో ముఖ్యమైనది.
29 కోట్ల 42 లక్షల ఉపాధి కూలీల్లో ప్రస్తుతం 14 కోట్ల 31 లక్షల మందికే ప్రభుత్వాలు పని కల్పిస్తున్నాయి. కేరళ మినహా అన్ని రాష్ట్రాలు పనులు కల్పించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్‌లో గత రెండు, మూడు సంవత్సరాలుగా లక్షల మంది పని కోసం దరఖాస్తులు పెట్టుకుంటే పనులు ఇవ్వకుండా అక్కడి ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నాయి. కోర్టులు జోక్యం చేసుకున్నా ఫలితం లేదు. ఇన్ని పరిమితుల్లో కూడా 2020-21 ఆర్థిక సంవత్సరంలో 389.32 కోట్ల పని దినాలు ఉపాధిలో దేశ వ్యాపితంగా లభించాయి. ఇలాంటి ఉపాధి హామీకి మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలి. కానీ బిజెపి తీసుకొచ్చిన ఈ అడ్వయిజరీ ఫైల్ మొత్తం ఉపాధి హామీని తలకిందులు చేసేలా వుంది.
ఉపాధిలో ఎస్సీ, ఎస్టీల వివరాలను సేకరించేది సబ్‌ప్లాన్ ద్వారా నిధులిచ్చి మరింతగా ఈ తరగతులకు లబ్ధి చేయడానికేనని బిజెపి అబద్దపు ప్రచారం చేస్తున్నది. గత సంవత్సరం కల్పించిన పని దినాల్లో ఎస్సీలు 19.86 శాతం, ఎస్టీలు 17.9 శాతం పని దినాలు పొందారు. ఎస్సీ, ఎస్టీలు 37.76 శాతం. అంటే 140 కోట్లకు పైగా పని దినాలు లభించాయి. దేశంలో ఎస్సీ, ఎస్టీ జనాభా 24.4 శాతం ఉంటే, జనాభా కంటే 13 శాతానికి పైగా అదనంగా ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్నారు. దళిత, గిరిజన ప్రజలకు గ్రామాల్లో ఉపాధి హామీ ఒక జీవనాధారం అయ్యింది. సబ్‌ప్లాన్ నిధులు జనాభా ప్రాతిపదికపై బడ్జెట్‌లో కేటాయింపులు చూపిస్తున్నారు. ఉపాధి హామీకి సబ్‌ప్లాన్ నిధులు మరలించాలంటే జనాభా ప్రాతిపదిక మీద 24.4 శాతమే ఇస్తారు. అదనమైన 13 శాతం పని దినాలకు వేతనాలు ఎక్కడి నుండి వస్తాయి? దేశంలో ఈ స్థితి ఉంటే చాలా రాష్ట్రాల్లో ఉపాధి హామీ పనులు 40 నుండి 60 శాతం వరకు దళితులు, గిరిజనులే చేస్తున్నారు. పంజాబ్‌లో జాబ్‌కార్డులు, ఉపాధి కూలీలు మొదలు ఉపాధి పనులు 60 శాతానికి పైగా ఒక్క దళితులే చేస్తున్నారు. అక్కడి జనాభా నిష్పత్తిలో నిధులు ఇస్తామని చెప్పినా పంజాబ్‌లో ఎస్సీ జనాభా 30 శాతం మాత్రమే. మిగిలిన 30 శాతం వేతనాల పరిస్థితి ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి పని దినాల్లో 33.38 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 28.5శాతం, తెలంగాణలో 40 శాతం ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. సబ్‌ప్లాన్ నిధుల నుండి వేతనాలు ఇవ్వడానికి అనేది పచ్చి బూటకం.
నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఉపాధి హామిని బలహీనపర్చడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగిస్తున్నారు. కేటాయింపులు సగానికి తగ్గాయి. 2021-22 కేంద్ర బడ్జెట్‌లో గత ప్రభుత్వాలు కేటాయించినట్టు కనీసం 4 శాతం కేటాయిస్తే 1,44,000 వేల కోట్లకు తక్కువ కాకుండా ఉపాధి హామీకి బడ్జెట్ కేటాయింపులు జరగాలి. కానీ ఈ సంవత్సరం బిజెపి ప్రభుత్వం 71 వేల కోట్లే ఇచ్చింది. బడ్జెట్ తగ్గిపోవడంతోటే ఉపాధి పనుల కల్పనలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు సగం మందికే పనులు కల్పిస్తున్నారు. ఉపాధి హామీ నిధుల్లో 10 శాతానికి మించి మెటీరియల్‌కు ఖర్చు పెట్టకుండా గతంలో అమలైతే, బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత 40 శాతానికి మెటీరియల్‌ను వినియోగించుకోవడానికి అవకాశం ఇచ్చారు. దీంతో యంత్రాలు, కాంట్రాక్టర్లు, మనుషులు చేయలేని పనులను ఎంపిక చేయడం జరుగుతుంది. గతంలో ఉపాధి హామీ నిధులను దళిత, గిరిజనులకు ప్రభుత్వాలు వచ్చిన లేదా స్వంత భూముల అభివృద్ధికి ల్యాండ్ డెవలప్‌మెంట్ పేరుతో వేల కోట్లు వినియోగించాయి. స్వంత భూమిలో పని చేసుకోవడం వలన భూములు సాగులోకి తెచ్చుకున్నారు. బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం, మెటీరియల్ కాంపొడెంట్‌ను 40 శాతానికి పెంచడం, ల్యాండ్ డెవలప్‌మెంట్ లేకపోవడంతో చట్టం యొక్క స్ఫూర్తికే బిజెపి తిలోదకాలిచ్చింది.
ఇప్పుడు వామపక్ష ప్రభుత్వాలున్న రాష్ట్రాలు తప్ప... కేంద్రంతో పాటు, కాంగ్రెస్, బిజెపి, ప్రాంతీయ పార్టీలన్న తేడా లేకుండా ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్నాయి. ఒకప్పుడు ఉపాధిలో అగ్రభాగాన ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఆ ఒరవడి తగ్గింది. ఎ.పి లో గత సంవత్సరం 25.93 కోట్ల పని దినాలు, తెలంగాణలో 15.79 కోట్ల పని దినాలు లభించాయి. బిజెపి పాలక రాష్ట్రాల్లో ప్రారంభం నుండి ఉపాధి హామీపై శ్రద్ధ లేదు. ఉత్తరప్రదేశ్‌లో అయితే ప్రాణాళికాబద్దంగా ఉపాధి హామీని లేకుండా చేస్తున్నారు. 20 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 2.21 కోట్ల జాబ్‌కార్డులు, 3.12 కోట్ల ఉపాధి కూలీలను మాత్రమే నమోదు చేసారు. గత సంవత్సరం పనులు కల్పించడంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో 41 కోట్ల పని దినాలు కల్పిస్తే యు.పి లో 39.47 కోట్లే ఇచ్చారు. యు.పి లో మూడున్నర కోట్ల మందికి పైగా దళితులున్నారు. 65 శాతానికి మించి దళితులకు గ్రామాల్లో జాబ్‌కార్డులు ఇవ్వడం లేదు. యు.పి లో సగం జనాభా కూడా లేని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 కోట్ల మందికి పైగా ఉపాధి కూలీలు ఉన్నారు. కేరళలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబానికి, వయోజనుడికి జాబ్‌కార్డులు ఇచ్చారు. త్రిపురలో వామపక్ష ప్రభుత్వం ఉన్నప్పుడు 70 శాతానికి పైగా ప్రజలకు జాబ్‌కార్డులు ఇవ్వడమే కాకుండా, ప్రతి దళిత, గిరిజనులకు ఉపాధి హామీని 100 రోజులకు తగ్గకుండా కల్పించారు.
ఉపాధి హామీ వల్ల వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు, ప్రత్యేకించి దళిత, గిరిజనులు, ఓబీసీ లకు కొన్ని పనిదినాలు దొరికాయి. రెండు, మూడు నెలలు ఆహారానికి ఇబ్బంది లేని పరిస్థితి ఏర్పడింది. కొంత కొనుగోలు శక్తి పెరిగింది. ప్రత్యేకించి గ్రామ పెత్తందారులపై పది ఇరవై రూపాయలకు ఆధారపడే పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కొంత పరపతి ఏర్పడింది. వ్యవసాయంలో వేతనాల పెంపుపై బేరమాడే అవకాశం వచ్చింది. పేదల భూములు కొంతమేరకైనా సాగులోకి తెచ్చుకున్నారు. చట్ట స్ఫూర్తి సంపూర్ణంగా అమలైతే గ్రామీణ ప్రాంతాల్లోని పెత్తందారులు, ఆధిపత్య కులాలను ఎదిరించే అవకాశం గ్రామీణ పేదలకు వచ్చేది. గుడ్డిలో మెల్లగా అమలవుతున్న ఉపాధి చట్టం వల్ల కలిగే ఈ ప్రయోజనాలకు గ్రామీణ ధనిక వర్గానికి కంటగింపుగా ఉన్నది. ఈ చట్టాన్ని అమలు జరపకపోతే ప్రజల నుండి పూర్తిగా వెలివేయబడతామని, అలాగని చట్టాన్ని అమలు జరపడం ఏ కోశాన ఇష్టంలేని పెత్తందారులు, హిందూత్వవాదులు కలిసి ఉపాధి హామీ పీక నులమడానికే ఈ ప్రయత్నాలన్నీ.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అడ్వయిజరీ ఫైల్‌లో ఉన్న అంశాలు అమలైతే అందరికంటే నష్టపోయేది దళితులు, గిరిజనులే. సబ్‌ప్లాన్ పేరు చెప్పి, జనాభా ప్రాతిపదికన నిధులిచ్చి దళిత-గిరిజనులకు ఇప్పుడు పొందుతున్న పనులు సగానికి తగ్గిస్తారు. తద్వారా దళితులను పూర్వ స్థితికి, అంటే పెత్తందారులకు ఊడిగం చేసే స్థితికి నెట్టేస్తారు. ఎస్సీ, ఎస్టీల పేరు చెప్పి ఓబీసీ, బీసీలకు ఉపాధి హామీ పనులు లేకుండా చేస్తారు. దేశ వ్యాపితంగా 35 నుండి 40 శాతం పనులు ఓబీసీ, బీసీలు చేస్తున్నారు. భవిష్యత్‌లో వారికి అవకాశం లేకుండా ఈ చట్టాన్ని తలకిందులు చేస్తారు. దళిత, గిరిజనులను కులాల పేరుతో దేశమంతా గ్రూపులు ఏర్పాటు చేసి పని ప్రదేశాల్లో కుల వైషమ్యాలను పెంచుతారు. సమిష్టిగా చేసే ఉపాధి పని కుల ఘర్షణలకు కేంద్రమవుతుంది. దీనిని పెత్తందారులు అవకాశంగా వినియోగించుకుంటారు. కులాల పేరుతో ఏర్పడే గ్రూపులను గ్రామ పంచాయితీలు ఇష్టానుసారం పనులు ఇస్తారు. దళిత, గిరిజనులకు కఠినమైన పనులు, తక్కువ వేతనాలు పడేటట్లుగా ఈ ఆధిపత్య వర్గాలు ప్రయత్నిస్తాయి. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఇతర గ్రూపులకు వేతనాలు ఇచ్చి, దళిత, గిరిజనుల గ్రూపులకు వేతనాలు రాకపోవడంతో వీరిలో అలజడి మొదలైంది. ఇప్పటి వరకు గ్రూపుల వారీగా చేసే పనులను బట్టి వేతనాల్లో హెచ్చు తగ్గులున్నాయి. పూర్వ కాలంలో, ప్రస్తుతం కూడా కొన్ని ప్రాంతాల్లో దళితులకు, ఇతర కులాల కంటే తక్కువ వేతనాలు ఇచ్చిన నేపథ్యం మన దేశంలో ఉన్నది. ఆ స్థితి ఉపాధిలో పునరావృతం అవుతుంది. ఇప్పటి వరకు 50 శాతం ఉపాధి పనులను మహిళలు చేస్తున్నారు. కులాల విభజన వచ్చిన తర్వాత మహిళలు చేయలేని పనులను ప్రవేశపెట్టి వీరికి పనులు సగానికి సగం తగ్గిస్తారు. ఉపాధిలో గ్రామీణ శ్రేణులు ఐక్యంగా పని చేస్తున్నాయి. ఇప్పుడు పనులు, వేతనాలు, చెల్లింపులు, సౌకర్యాల్లో కులాల బీజాలు నిట్ట నిలువున చీలిపోతాయి. అంతిమంగా ఈ అడ్వయిజరీ వల్ల అందరికంటే దళిత, గిరిజనులు, అన్ని కులాల్లో ఉన్న మహిళలకు తీవ్ర నష్టం కలుగుతుంది. రైతు చట్టాలు, విద్యుత్ బిల్లు, కార్మిక చట్టాల కోడ్‌ల కోవ లోనే ఉపాధి హామీలో కుల విభజనను చూడాలి. దేశ వ్యాపితంగా రైతాంగం, కార్మికులు, వ్యవసాయ కార్మికులు చేస్తున్న చట్టాల వ్యతిరేక పోరాటంలో ఉపాధి హామీలో బిజెపి తెచ్చిన కుల విభజనను జోడించాలి.
ఉపాధి హామీ ఉండటం వల్లనే గ్రామీణ ప్రాంతాల్లో దేశ వ్యాపితంగా సామూహిక ఆకలిచావులను నివారించగలిగాం. వ్యవసాయ వేతనాలు పెరిగాయి. పోరాడి సాధించుకున్న ఉపాధి హామీని కాపాడుకోవడానికి మరో పోరాటమే మార్గం. కులాల విభజన రద్దుకు, 200 రోజుల పని, రోజు వేతనం రూ.600 కోసం దేశ వ్యాపిత సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి.
- బి. వెంకట్ /వ్యాసకర్త ఎఐఎడబ్ల్యుయు జాతీయ ప్రధాన కార్యదర్శి /










