ప్రజాశక్తి - ఆదోని
ఆదాయం కోసం ఇతరులు బార్బర్ షాపులు నెలకొల్పడం వల్ల కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్న తాము ఆర్థికంగా నష్టపోతున్నామని, తమ వృత్తిని కాపాడాలంటూ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఈరన్న, గౌరవాధ్యక్షులు రంగస్వామి డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని మంగళ అనంత ఆంజనేయస్వామి ఆలయం ముందు శిబిరంలో దీక్షలు ప్రారంభించారు. పట్టణంలో సుమారు 350 బార్బర్ షాపులను మూసివేసి మంగలి కులస్తులు దీక్ష శిబిరానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదోని పట్టణంలో ఇప్పటికే ఇతర కులస్తులు మసాజ్, బార్బర్, మేకప్ దుకాణాలు నెలకొల్పి తమ ఆదాయానికి గండి కొడుతున్నారని తెలిపారు. దశాబ్ద కాలంగా క్షవరం చేస్తూ జీవనాధారం చేసుకొని జీవిస్తున్న తమ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి అందంగా దుకాణాలను తీర్చిదిద్ది, ఆఫర్ల పేరుతో కస్టమర్లను ఆకర్షిస్తూ, సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారన్నారు. వారి పోటికి తాము తట్టుకోలేక గిరాకీ కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కుల వృత్తి ద్వారా వచ్చే ఆదాయంతోనే కుటుంబం నెట్టుకుంటూ, పిల్లలను చదివిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. అలాంటి తమ కడుపు కొట్టేందుకు ఇతరులు తమ రంగంలోకి ప్రవేశించి ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. పెద్ద నగరాల్లో అయితే కనపడదని, చిన్న పట్టణాల్లో ఇతరులు కూడా బార్బర్ దుకాణాలు నెలకొల్పి కార్యకలాపాలు సాగిస్తే తాము తీవ్రంగా నష్టపోతున్నామని, న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికే ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, పోలీసుల దృష్టికి సమస్యను తీసుకెళ్లామన్నారు. అన్ని కుల సంఘాల మద్దతు తమకు ఉందని వివరించారు. ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. దీక్ష శిబిరానికి బిజెపి రాష్ట్ర కార్యదర్శి కునిగిరి నీలకంఠ మద్దతు ప్రకటించారు. కుల వృత్తినే జీవనాధారం చేసుకునే నాయీ బ్రాహ్మణులకు అధికారులు అండగా నిలవాలని కోరారు. నాయీ బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు ఎస్‌ఎం.నాగరాజు, నాయకులు వడ్డేమాన్ ఈరన్న, గోవిందు, కోశాధికారి నాగరాజు, సభ్యులు శేఖర్, మునిస్వామి, బసవరాజు, శ్రీనివాసులు, అశోక్ ఉన్నారు.
దీక్ష శిబిరంలో కూర్చున్న మంగలి కులస్తులు










